సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనకు కారణం ఇదేనట..
- IndiaGlitz, [Wednesday,December 09 2020]
జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనకు సంబంధించిన మిస్టరీని కొంతమేరకు అధికారులు ఛేదించారు. దీనికి జల కాలుష్యమే కారణమని.. నీటిలో విష రసాయనాల అవశేషాలున్నట్టు ప్రాథమిక నివేదికల్లో తేలిందని సమాచారం. బాధితుల నాడీ వ్యవస్థలోకి విష పదార్థాలు చేరినట్లు ఇప్పటికే వైద్యులు గుర్తించారు. ఇలా విష పదార్థాలు ఏలూరు వాసుల శరీరంలోకి చేరడానికి కారణం.. నీటిలోని సమస్య ఉండటమే కారణమని నిపుణులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. తొలుత ఏలూరులోని ఒక్క ప్రాంతం వారే ఇబ్బందికి గురవగా.. సాయంత్రానికి ఏలూరులోని అన్ని ప్రాంతాలకు వ్యాపించింది.
ఈ విషయం బయటపడగానే అప్రమత్తమైన జిల్లా అధికారులు... తొలుత ఆయా ప్రాంతాల్లో నీళ్లను పరీక్షించారు. అయితే ఏమీ తేలకపోవడంతో మరోసారి పరీక్షించేందుకు నమూనాలను సేకరించారు. ‘పెస్టిసైడ్స్ దుకాణాల్లో నిషేధిత రసాయనాలు ఉన్నాయా? అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని పురుగు మందుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాగా.. ఎయిమ్స్ బృందం నిర్వహించిన తనిఖీల్లో ఏలూరులోని తాగునీటిలో సీసం(లెడ్), నికెల్ ఉన్నట్టు ప్రాథమికంగా తేలింది. వీటి వల్ల మెదడు ప్రభావితమై నేరుగా మూర్ఛ వంటి లక్షణాలతో జనం కుప్పకూలుతారని ఎయిమ్స్ బృందం తెలిపింది. ఏలూరులో పెద్దగా పరిశ్రమలు లేవు. అయితే తాగునీటిలో హెవీ మెటల్స్ ఎలా కలిశాయన్న అంశంపై ఎయిమ్స్ బృందం దృష్టి సారించింది.
నీటి నమూనాలను పరీక్షల నిమిత్తం ఢిల్లీకి పంపించింది. అయితే సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి పంపించిన శాంపిల్స్‌లో వైరస్, బ్యాక్టీరియాకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. బాధితుల బ్లడ్ అనాలసిస్‌లో ఎలాంటి ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ కనిపించలేదు. మరోవైపు సోమవారం ఆసుపత్రుల్లో చేరిన 35 మంది నుంచి సెరబ్రల్ స్సైనల్ ఫ్లూయిడ్ తీసి పరీక్షించారు. ఇందులో సెల్‌కౌంట్ సాధారణంగానే ఉండగా... కల్చర్ రిపోర్టు కూడా నార్మల్ అని తేలింది. డబ్ల్యుహెచ్‌వో ప్రతినిధులు ఏలూరులో అనేక మందికి బ్రెయిన్ టెస్ట్‌లు నిర్వహించారు. వీరంతా కెమికల్ రియాక్షన్‌కు గురైనట్టు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. కృష్ణా కాలువ గట్ల వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలను పారేయడం, వాటిని తగులబెట్టి నీళ్లలోకి తోసేస్తుండటంతోపాటు... చేపల చెరువుల్లో వినియోగించే రసాయనాల వల్ల కానీ నీరు కలుషితమై ఉండచ్చని నిపుణులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.