Pawan Kalyan:అకీరాకు నేను ఇచ్చిన ఆస్తి ఇదే.. ఇక వాడి ఇష్టం: పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గత కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ-బీజేపీతో పొత్తు పెట్టుకుని అలుపెరుగని పోరాటం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గరి నుంచి సీట్ల సర్దుబాటుతో పాటు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. కూటమి అభ్యర్థుల తరపున సుడిగాలి పర్యటనలు చేశారు. మధ్యలో కొన్నిసార్లు అనారోగ్యానికి కూడా గురయ్యారు. అయినా కానీ గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగారు.
దీంతో ఆయన గెలుపుకోసం మెగా హీరోలతో పాటు ఇతర సినీ నటులు క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ఇటు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవడంతో పాటు ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ అనంతరం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలు, సినిమాలు, కుటుంబ విషయాలను కూడా పవన్ వెల్లడించారు. అందులో పిల్లల పెంపకం, వారి చదువు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“అర్బన్ ప్రాంతంలో ఉండే సగటు ఉద్యోగి పిల్లలు ఎలా పెరుగుతారో మా పిల్లలను కూడా అలాగే పెంచాం. వాళ్లకు నేను ఏం చెప్పానంటే.. మీకు చదువు చెప్పించగలను. కుదిరితే సినిమాలు చేసి ప్రాపర్టీ ఇస్తానన్నాను. వాస్తవానికి మా మధ్య ఆస్తుల గురించి టాపిక్ రాదు. నాకు ఓ ఇల్లు ఉండేది. దాన్ని అకీరా, ఆధ్య కోసం నా మాజీ భార్యకు రాసి ఇచ్చాను. పిల్లలకు మనం ఎంత ఆస్తి ఇచ్చాం అని కాదు. ఎంత నిలబెట్టుకుంటారు? అనేదే ముఖ్యం. మా నాన్న నాకు ఏం ఇవ్వలేదు. మా అన్నయ్య నాకు స్కిల్స్ నేర్పించారు. ధైర్యం ఇచ్చారు. దాన్ని ఆసరాగా చేసుకుని ఇండస్ట్రీలో కొనసాగాను. మంచి పురోగతి సాధించాను. నేను కూడా నా పిల్లలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ఎడ్యుకేషన్ అందించాను” అని వివరించారు. కాగా పవన్, మాజీ భార్య రేణు దేశాయ్‌కు అకీరా, ఆధ్య అనే పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరో భార్య అన్నా లెజీనోవాకు ఓ అబ్బాయి, అమ్మాయి కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో సినిమాలపై ఫోకస్ పెట్టనున్నారు. ముందుగా కొద్ది రోజుల పాటు ఆయన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చే సమయానికి తిరిగి రానున్నట్లు సమాచారం. ఫలితాలు వెల్లడైన వెంటనే ఆగిపోయిన సినిమా షూటింగ్స్ మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం సుజీత్‌తో కలిసి ‘ఓజీ‘, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్‘, క్రిష్-జ్యోతికృష్ణ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు‘ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూడు సినిమాలకు సంబంధించిన టీజర్లు, పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
‘ఓజీ‘ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘హరిహర వీరమల్లు‘ కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్నిటికంటే ముందుగా ‘ఓజీ’ షూటింగ్ లో పాల్గొననున్నారట. ఇప్పటికే చాలా వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా, వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. ‘ఓజీ‘ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్‘, ‘హరి హర వీరమల్లు‘ సినిమాలకు డేట్స్ ఇవ్వనున్నారు. ఈ సినిమాలతో పాటు సురేందర్ రెడ్డి, సముద్రఖని దర్శకత్వంలోనూ పవన్ సినిమాలు చేయనున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. మొత్తానికి ఇన్నాళ్లు రాజకీయాల్లో బిజీగా చూసిన తమ హీరోను.. త్వరలోనే వెండితెర మీద చూసేందుకు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments