CM Revanth Reddy:బీఆర్ఎస్ సభ్యులకు ఇదే నా శిక్ష: సీఎం రేవంత్ రెడ్డి

  • IndiaGlitz, [Saturday,December 16 2023]

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదం చర్చలో కాంగ్రెస్-బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. ఉదయం ప్రారంభమైన దగ్గరి నుంచే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఇక ఈ చర్చ ముగింపు సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఓటు వేశారన్నారు. అయినా కానీ వారిలో మార్పు రాలేదని.. అసెంబ్లీలో కుటుంబసభ్యులు కేటీఆర్, హరీశ్‌రావు తప్ప మిగిలిన సభ్యులకు అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. నిరంకుశత్వం ఎక్కువ కాలం నిలబడదని.. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతం, కడుగుతం అని శ్రీశ్రీ మాటల్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

అనంతరం గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలపై ఆయన ఆధారాలతో సహా మాట్లాడారు. ప్రజాభవన్ కు వచ్చి ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటుంటే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ప్రగతిభవన్ ముందు ఉన్న గేట్లను బద్ధలుకొట్టి ప్రజలకు అవకాశం ఇచ్చామన్నారు. గతంలో హోం మంత్రి మహమూద్ అలీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తే హోం గోర్డు మీకు ఇక్కడ అనుమతి లేదని చెప్పారని.. అలాగే అప్పటి ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌కూ సైతం ప్రవేశం కల్పించలేదన్నారు. ఆఖరికి ప్రజా యుద్ధనౌక, ఉద్యమ నేత గద్దర్ కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తే మండుటెండలో నిల్చోబెట్టారని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం మాత్ర సామాన్యులకు సైతం ప్రజాభవన్‌లోకి అనుమతి కల్పించిందని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తొలి కేబినెట్ భేటీలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించామన్నారు. నిరుద్యోగులకు, అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదని.. కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులు వచ్చాయని విమర్శలు కురిపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మాజీ డీఎస్పీ నళినికి పదేళ్ల ప్రభుత్వంలో సరైన గుర్తింపు ఇవ్వలేదన్నారు. అలాగే ఉద్యమకారులపై కూడా ఎత్తివేయలేదని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ కలుగజేసుకుని ఇలాంటి వ్యక్తి సీఎం అయినందుకు సిగ్గుగా ఉందని చెప్పారు. దీంతో మేనెజ్‌మెంట్ కోటాలో వచ్చిన కేటీఆర్‌ సీఎం కాలేదనే అక్కసు.. కుళ్లుతో రగిలిపోతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. అలాగే రైతుల ఆత్మహత్యలు, పేపర్ లీకేజీలు, నీటి ప్రాజెక్టులు, డ్రగ్స్ కేసు గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలపై రేవంత్ రెడ్డి నిలదీశారు.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన స్పీచ్‌కు అడ్డుపడ్డారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండ్ చేయండని స్పీకర్‌కు సూచించారు. అయితే రేవంత్ రెడ్డి అధ్యక్షా.. వారిని బయటకు పంపించవద్దు.. వారు వినాల్సిందే.. వారికి ఇదే శిక్ష.. వాళ్లను ఇక్కడ కూర్చోబెట్టి.. కఠోరమైన నిజాలు వినడం ద్వారా వాళ్లలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. మొత్తానికి కాంగ్రెస్-బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య హాట్‌హాట్‌ చర్చ జరగ్గా.. స్పీకర్ గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.