ఈ ఏడాది `బ్రోచెవారెవరురా` సినిమాతో హిట్ కొట్టిన హీరో శ్రీవిష్ణు. ఈయన హీరోగా నటించిన మరో చిత్రం `తిప్పరా మీసం`. టైటిల్ వినగానే పక్కా మాస్ మూవీగా అనిపించినా ఇది మదర్ సెంటిమెంట్‌ను బేస్ చేసుకుని తెరకెక్కిన చిత్రం. మరి ఇలాంటి ఎమోషనల్ మూవీకి మాస్ టైటిల్ ఎందుకు పెట్టారు. వైవిధ్యమైన కథా చిత్రాలకు ప్రాధాన్యతనిచ్చే హీరో శ్రీవిష్ణు అసలు ఈ సినిమా చేయడానికి కారణమేంటి? ఈ సినిమాతో శ్రీవిష్ణు మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...
కథ:
మణిశంకర్(శ్రీవిష్ణు) తల్లి(రోహిణి)ని ద్వేషిస్తుంటాడు. అందుకు కారణం చిన్నప్పుడు డ్రగ్స్‌కి అలవాటైన తనను రీహేబిలేషన్ సెంటర్‌లో ఒంటిరిగా ఉంచడమే. దాంతో కుంటుంబానికి దూరంగా ఓ నైట్ పబ్‌లో డీజేగా పనిచేస్తుంటాడు. డబ్బులు కోసం బెట్టింగ్‌లు కాసి పందాలు వేస్తుంటాడు. క్రికెట్ బెట్టింగ్‌లు కారణంగా మణి 30 లక్షలు అప్పులవుతాడు. ఆ అప్పుల కోసం తనకు ఆస్థిని ఇచ్చేయమని తల్లి దగ్గరకెళ్లి గొడవ పడతాడు. ఆమె తన దగ్గరున్న ఐదు లక్షల రూపాయలకు చెక్ ఇస్తుంది. దాన్ని 40 లక్షల చెక్‌గా మార్చి బౌన్స్ అయ్యేలా చేసి ఆమెపై చెక్ బౌన్స్ కేసు పెడతాడు. దాంతో మణి చేసిన పనిని, అతని గర్ల్‌ఫ్రెండ్ మౌనిక(నిక్కితంబోలి) సహా అందరూ తప్పు పడతారు. చివరకు మణి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? మణి హత్యా నేరంపై ఎందుకు జైలుకెళ్లాడు? అనే సంగతులు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
నటీనటుల విషయానికి వస్తే.. ప్రధానంగా శ్రీవిష్ణు, రోహిణి క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమిది. శ్రీవిష్ణు క్యారెక్టర్‌లో రెండు షేడ్స్ కనపడతాయి. బెట్టింగ్‌లకు అలవాటు పడి తల్లిని ద్వేషించే కొడుకు పాత్ర. ఈ పాత్ర ప్రీ క్లైమాక్స్ వరకు సాగుతుంది. మరో యాంగిల్ కుటుంబం కోసం త్యాగం చేసే కొడుకు. ఈ రెండు పాత్రలకు శ్రీవిష్ణు తనదైన రీతిలో తన నటనతో న్యాయం చేశాడు. ముఖ్యంగా డబ్బు కోసం తల్లిపై కోర్టులో కేసు వేసే కొడుకుగా నెగిటివ్ యాంగిల్‌లో చక్కగా నటించాడు శ్రీవిష్ణు. అలాగే అన్నయ్యగా, కొడుకుగా కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఏం చేశాడనే కోణంలోనూ తన నటన మెప్పిస్తుంది. ఇక తల్లి పాత్రలో చేసిన రోహిణి.. ఎక్కడా ఓవర్ యాక్షన్‌లా కాకుండా పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. ఇక నిక్కి తంబోలి పాత్ర మేరకు నటనతో ఆకట్టుకుంది. హీరో మావయ్య పాత్రలో బెనర్జీ కూడా చక్కగా నటించాడు. అచ్యుత రామారావు పాత్ర కూడా బావుంది. నవీన్ హీరో ఫ్రెండ్‌గా నటించాడు. కాళీ పాత్రలో నటించిన నటుడు, హీరో చెల్లెలుగా నటించిన అమ్మాయి, రవిప్రకాశ్, రవివర్మ తదిరతులు అందరూ బాగా నటించారు. ఇక సాంకేతికంగా చూస్తే దర్శకుడు కృష్ణ విజయ్ మంచి పాయింట్‌ను ఎంచుకున్నా కూడా దాన్ని ఆసక్తికరంగా మలచడంలో అంతగా సక్సెస్ కాలేకపోయాడు. హీరో క్యారెక్టర్‌ను నెగటివ్‌గా ప్రొట్రేట్ చేసే సందర్భంలో ఆయన రాసుకున్న సన్నివేశాలు మరి లెంగ్తీగా ఉండి సినిమా కొన్ని సన్నివేశాల్లోసాగదీతగా అనిపిస్తాయి. సురేష్ బొబ్బిలి సంగీతం ఎఫెక్టివ్‌గా లేదు కానీ... నేపథ్య సంగీతం బావుంది. సిద్ కెమెరా వర్క్ బావుంది. డైలాగ్స్ కొన్ని సందర్భాల్లో బాగా ఉన్నాయి. లవ్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఆకట్టుకోకపోయినా.. మదర్ సెంటిమెంట్ సీన్స్ , ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్ మెప్పిస్తుంది.
చివరగా.. తిప్పరా మీసం.. ఆకట్టుకునే మదర్ సెంటిమెంట్
Comments