వివాహ విందు: వీళ్లు ట్రెండ్ సెట్ చేశారు..
- IndiaGlitz, [Saturday,December 12 2020]
‘వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు..’ అంటూ ఓ పాటనే కట్టాడో కవి. వివాహ భోజనానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. పెళ్లిలో హంగూ ఆర్భాటాల కంటే.. విందే బంధుమిత్రులకు ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. చర్చ కూడా విందు గురించే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రస్తుతం అంత సీన్ లేకుండా పోయింది. కొన్ని నెలలుగా వివాహాలు జరిగినా తూతూ మంత్రంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓ జంట తమ వివాహ విందు విషయంలో ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడిది నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడుకు చెందిన ఓ జంట తమ వివాహం కలకాలం గుర్తుండిపోయేలా ప్లాన్ చేసింది. దీనిలో ఫస్ట్ స్టెప్ వివాహ విందే కాబట్టి.. ఆ వైపు నుంచి ప్లాన్ చేసింది. అదేమిటంటే శుభలేఖ ఇచ్చిన ప్రతి ఇంటికీ... పెళ్లి రోజున విందు భోజనం పార్శిల్‌ను కూడా అద్భుతంగా ప్యాక్ చేసి కూడా పంపించింది. ఈ విషయాన్ని ముందుగానే తమ ఇన్విటేషన్ కార్డులో ప్రింట్ చేసింది. అంతేనా... వధూవరుల పేర్లు, ముహూర్తం తదితర వివరాలతో పాటు విందులో ఏమేమి వడ్డించేదీ వరుస నంబర్లు వేసి మరీ అందులో రాసుకొచ్చారు.
మామూలుగా అందించే భోజనంతో పాటు నాలుగైదు రకాల స్వీట్లు, అదే మొత్తంలో వెరైటీ ఒడియాలు, పచ్చళ్లు... వగైరా అన్నీ కలిపి మొత్తంగా ఇరవై మూడు రకాల వంటకాలు నాలుగు అందమైన బాక్సుల్లో సర్ది పంపారు. అవి చూసిన బంధుమిత్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘వెబినార్’లో ఈ పెళ్లి జరిగింది. ఓ వైపు వెబ్‌నార్‌లో వివాహ వేడుక... కళ్ల ముందు నోరూరించే భోజనం పార్శిల్... ఇంటిల్లీపాదీ రుచులు ఆస్వాదిస్తూ... వధూవరులను మనసారా అభినందించారు. ఇప్పుడీ శుభలేఖ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.