దిశ ఘటన: వాళ్లేం పెద్ద క్రిమినల్స్ కాదు: పోసాని

  • IndiaGlitz, [Tuesday,December 03 2019]

వెటర్నరీ డాక్టర్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ కామాంధులను పోలీసులు అదుపులోకి తీసుకున్న మరుక్షణం నుంచే వాళ్లు భూమ్మీద బతకడానికి వీల్లేదని వెంటనే ఉరిశిక్ష లేదా ఎన్‌కౌంటర్ చేయాలంటూ.. వారుండే పోలీస్ స్టేషన్ వద్ద మహిళా సంఘాలు, ప్రజా సంఘాలతో పలు సంఘాలు పిలుపునిచ్చాయి. మరోవైపు ఈ ఘటనపై గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఉండే రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, ప్రముఖులు అందరూ స్పందించి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించకుండా ఏవేవో పిచ్చి ఫొటోలు షేర్ చేసిన కొందరు నెటిజన్ల ఆగ్రహానికి లోనయ్యారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి స్పందించారు.

ఎందుకిలా అన్నారో..!?
దిశ ఘటనలోని నలుగురు నిందితులు పెద్ద క్రిమినల్స్ కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే.. మనం ఓట్లేసి గెలిపించుకుంటున్న కొందరు నేతలు, నియమించుకుంటున్న కొందరు పోలీసులు, మనం కొలిచే కొందరు బాబాలతో పోల్చితే వీళ్లేం పెద్ద నేరస్తులు కాదని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలను సంచలన వ్యాఖ్యలను అనాలో లేకుంటే వత్తాసు పలికే వ్యాఖ్యలు అనాలో.. అసలు ఈ వ్యాఖ్యల వెనుక అర్థం.. అంతారర్థం పోసానికే తెలియాలి మరి.

చంపితే ఆగుతాయా..!?
అంతటితో ఆగని పోసాని.. ఆ నలుగురు నిందితులను చంపినంత మాత్రాన నేరాలు తగ్గిపోతాయా? అని ఎదురు ప్రశ్న సైతం వేస్తున్నారు. అత్యాచారం చేశారు కాబట్టే చంపేయాలనడం.. సబబు కాదన్నారు. ఆ నలుగుర్నీ చంపినా ఇలాంటి వాళ్లు బయట కోట్ల మంది ఉన్నారని, మరి వాళ్లనేం చేస్తారు..? వారి సంగతేంటి..? అని ప్రశ్నిస్తున్నారు. అరబ్ లాంటి దేశాల్లో అమలు చేస్తున్న శిక్షలు ఇక్కడ అమలు చేయాలంటున్నారు సరే.. ఆ నలుగుర్ని చంపినంత మాత్రాన దేశంలో ఉన్న 130 కోట్ల మందిలో మార్పు రాదని పోసాని చెప్పుకొచ్చారు. మరి పోసాని వ్యాఖ్యలపై ప్రముఖులు, మహిళా సంఘాలు ఇంతవరకూ స్పందించలేదు.