ఢిల్లీలో బీజేపీని ఆ పదాలే కొంపముంచాయ్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ తన ‘చీపురు’తో ఢిల్లీని క్లీన్ స్వీప్ చేసేశారు. ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లనే దక్కించుకున్న ఆయన ప్రేమికుల రోజున ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మాత్రం అడ్రస్ లేకుండా పోయాయ్.. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ పుంజుకోగా.. కాంగ్రెస్ మాత్రం రెండోసారి కూడా డిపాజిట్లు దక్కలేదు. అసలు ఢిల్లీలో కాంగ్రెస్ జెండా పీకేద్దామా..? అని ఆ పార్టీ పెద్దలు కూడా విస్తుపోయేలా పరిస్థితులు నెలకొన్నాయ్.
ఆ పదాలే!
ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు వచ్చిన కేంద్ర మంత్రి, బీజేపీలో నంబర్-02 అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆ రెండు పదాలే ఢిల్లీలో బీజేపీని కొంపముంచాయన్నట్లుగా ఆయన ప్రకటించడం గమనార్హం. ‘కాల్చి పారేయండి’ (గోలీమార్), ‘దేశ ద్రోహులను తరిమేయండి’, ‘ఇండిగో పాక్ మ్యాచ్’ వంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల బీజేపీకి నష్టం వాటిల్లిందని షా తెలిపారు. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో ఇలాంటి పదాలకు బీజేపీ చాలా దూరంగా ఉంటుందని.. కానీ అలాంటి వ్యాఖ్యలు తమ పార్టీ నాయకులు ప్రచారంలో భాగంగా ప్రసంగించడం వల్లే తమకు ఎన్నికల్లో నష్టం చేకూరిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎవరైనా రావొచ్చు!
‘గెలుపోటముల కోసం ఎన్నికల్లో ఎప్పుడూ తలపడలేదు. పార్టీ భావజాల వ్యాప్తి కోసమే ప్రయత్నిస్తున్నాం. ఢిల్లీ ఎన్నికల్లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ ప్రభావం లేదు. ఈ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించింది కాంగ్రెస్ పార్టీనే. సీఏఏ సంబంధిత అంశాలపై నాతో ఎవరైనా మాట్లాడవచ్చని, ఇందుకోసం తన కార్యాలయానికి రావాలి. వారికి మూడు రోజుల్లో సమయం కేటాయిస్తాను. అయితే, శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది’ అని షా మీడియా ముఖంగా వెల్లడించారు.
ఎన్నికల ప్రచారం ఎవరేం మాట్లాడారు..!
ఒక్క కేజ్రీవాల్‌ను ఓడించడానికి గుజరాత్ గుత్తేదార్లు అంబానీ, ఆదాని, నాగపూర్ పెద్దమనుషులంతా కలిసి ఒక సాధారణ ముఖ్యమంత్రి కనీసం ఒక కానిస్టేబుల్‌ను బదిలీ చేసే అధికారంలేని డిల్లీ ముఖ్యమంత్రిని ఓడించడానికి రాత్రి పగలు నిద్రాహారాలు మాని ఢిల్లీ గల్లిల్లో... 10 మంది బీజేపీ ముఖ్యమంత్రులు, 200 మంది బీజేపీ ఎంపీలు, 70 మంది బిజెపి
మంత్రులు..! ప్రచారం చేశారు. అంటే నియోజకవర్గానికి ఒక మంత్రి.. లక్షలాదిమంది భాజపా కార్యకర్తలు..!! వేల కోట్ల రూపాయలు, మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చులు...! చేశారు.
ఫలితం ఇదీ..!
వీటికి తోడు.. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎన్నికల ప్రచారంలో తన రెండు చేతులను పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ‘దేశ ద్రోహులను కాల్చి చంపేయాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు జనం కేకలు వేస్తుండగా మంత్రి ఆ ఊపులో ‘వారిని తుపాకీతో కాల్చిపారేయాలి’ (గోలీ మారో) అంటూ రెచ్చగొట్టేలా ప్రసంగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియాలో వీళ్లు చేసిన వ్యాఖ్యలు.. మీడియా ముందు చేసిన హడావుడి చాలానే ఉన్నాయి. వీటన్నింటికీ ఫలితం ఆప్-62 సీట్లు.. బీజేపీకి కేవలం-08 సీట్లు. అందుకే ప్రభుత్వ లోటుపాటులేంటో చెప్పి.. అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది గట్టిగా చెప్పుకుంటూ జనాల్లోకి వెళ్లాలే తప్ప ఇలా ‘గోలీమార్’ లాంటి వ్యాఖ్యలతో ఫలితాలు ఇలానే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout