తెలంగాణలో పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 17 లోక్‌సభ నియోజకవర్గాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. తమ గ్రామాల్లో సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఓటు వేసేది లేదని తేల్చి చెబుతున్నారు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంల కొడంగల్‌లోని ఓ పల్లెలో మూడు రోజులుగా పవర్ లేదని ప్రజల పోలింగ్ బహిష్కరించారు. ఊరిలోని ఏ ఒక్కరు కూడా ఓటు వేసేందుకు రాలేదు. మూడు రోజులుగా కరెంటు లేక ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. దీంతో అధికారులు గ్రామస్తులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని వారితో చర్చలు జరిపారు.
అటు నిర్మల్ జిల్లా అల్లంపల్లిలో కూడా రోడ్డు సరిగా లేదని ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎప్పటి నుంచో ఉన్న రోడ్డు సమస్య తీర్చే వరకు ఓటు వేసేది లేదని భీష్కించుకొని కూర్చున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా మైలారంలో కూడా ప్రజలు పోలింగ్‌ను బాయ్‌కాట్ చేశారు. స్థానికంగా జరుగుతున్న మైనింగ్‌తో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. దీంతో మైనింగ్ పనులు ఆపేంత వరకు ఓటు వేయబోమన్నారు. ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కలలో ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలకు తమ పంటలు పూర్తిగా పాడైపోయాయని వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలింగ్ వరకు రైతుల సమస్యలపై మాట్లాడుతున్న నేతలు తర్వాత వారి సమస్యలను గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు గ్రామస్తులతో మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఉన్నతాధికారులతో మాట్లాడి కచ్చితంగా సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
అలాగే ఖమ్మం జిల్లా రాయమాదారంలో ప్రజలు కూడా వంతెన కోసం పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై ఎప్పటి నుంచో వంతెన ఏర్పాటు చేయమంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తమ ఊరిలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేదన్న కారణంతో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని కోడిచర్ల తాండా వాసులు ఓటు వేయడానికి నిరాకరించారు. విషయం తెలుసుకున్న కొత్తూరు ఎమ్మార్వో తాండా ప్రజలకు రాబోయే ఎన్నికల నాటికి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీయివ్వడంతో వారు నిరసన విరమించారు. మొత్తంగా ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామస్తులు నిరాకరించడం సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout