BRS Party:బీఆర్ఎస్ పార్టీలో విలువ లేదు.. మాజీ ఎంపీ రాజీనామా
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కీలక నేతలు అధికార కాంగ్రెస్. బీజేపీ పార్టీల్లోకి వెళ్లిపోవడంతో గులాబీ శ్రేణులు నిరుత్సాహంతో ఉన్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో మరో కీలక నేత తన క్యాడర్‌తో కలిసి పార్టీకి రాజీనామా చేశారు. ఓవైపు లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి మళ్లీ సత్తా చాటాలని చూస్తున్న కేసీఆర్‌కు కీలక నేతల రాజీనామాలు తలనొప్పిగా మారాయి. దీంతో పార్టీ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజాగా మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు పంపారు. ఏడాది క్రితం బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన రాపోలు.. ఇప్పుడు గులాబీ పార్టీకి రాజీనామా చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాపోలుతో పాటు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు తీగల లక్ష్మణ్ గౌడ్ కూడా గులాబీ పార్టీని వీడినట్లు సమాచారం. ఇంతకాలం తనను ఆదరించినందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంతా మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి తన అవసరం లేదని.. అందుకే గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని వెల్లడించారు. విధిలేని పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నానని పేర్కొన్నారు. తనను పార్టీలోకి ఆహ్వానిస్తూ కప్పిన గులాబీ కండువాను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వినమ్రంగా పోస్టు ద్వారా పంపిస్తున్నట్టు చెప్పారు. ఏ పార్టీలోకి వెళతాననేది ఇప్పుడే చెప్పలేనని.. ప్రజా ఉద్యమాల్లో మాత్రం ఉంటానని తెలిపారు.
కాగా రాపోలు ఆనందర్ భాస్కర్ తొలుత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2012లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 25 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన 2019లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి కాషాయం పార్టీలోనే ఉన్న రాపోలు.. 2022లో గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే గతేడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు పార్టీని వీడారు. మరి ఏ పార్టీలో చేరతారనేది ప్రకటించలేదు. తిరిగి సొంత గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com