Tamilisai:రాజీనామా వార్తల్లో నిజం లేదు: గవర్నర్ తమిళిసై క్లారిటీ
Send us your feedback to audioarticles@vaarta.com
తాను గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్రంగా ఖండించారు. అయోధ్య రామాలయ ద్వారాలు తయారుచేసిన సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోను తమిళిసై సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గవర్నర్ పదవికి రాజీనామా చేసి తూత్తుకుడి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టంచేశారు. ఎప్పుడూ ప్రజలతో ఉండడానికే ఇష్టపడతానని పేర్కొన్నారు.తాను అసలు ఢిల్లీనే వెళ్లలేదని.. ఎంపీగా పోటీ చేస్తానని ఎవరికీ ఎలాంటి విజ్ఞప్తి చేయలేదన్నారు.
వరదల ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న తూత్తుకూడి ప్రజలను పరామర్శించేందుకు మాత్రమే వెళ్లి వచ్చానని వెల్లడించారు. శ్రీరాముల వారి ఆశీస్సులతో పాటు ప్రధాని మోదీ దయతో తాను విధులను నిర్వహిస్తున్నానన్నారు. తాను తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్గానే కొనసాగుతానని.. అలాగే అధిష్ఠానం తనకు ఏ బాధ్యత అప్పగించినా మనస్ఫూర్తిగా నిర్వరిస్తానని క్లారిటీ ఇచ్చారు.
కాగా కొంతకాలంగా ఆమె తన స్వరాష్ట్రం అయిన తమిళనాడులోని తూత్తుకుడి సీటు నుంచి ఎంపీగా తిరిగి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిశారని కూడా ప్రచారం జరిగింది. బీజేపీ అధిష్టానం అంగీకరిస్తే తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవుల నుంచి తప్పుకుంటున్నానని ఆమె తెలిపినట్లు ఆ వార్తల్లోని సారాంశం. అయితే తాజాగా వాటిపై ఆమె స్పందిస్తూ ఆ వార్తలను పూర్తిగా ఖండించారు.
గవర్నర్ కాక ముందు తమిళిసై తమిళనాడు బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2006, 2011 ఎన్నికల్లో శాసనసభ్యురాలిగా పోటీచేసి ఓడిపోయారు. అలాగే 2009, 2014 సాధారణ ఎన్నికల్లోనూ తూత్తుకుడి లోక్సభ స్థానం నుంచి పరాజయం పొందారు. అయితే పార్టీలో ఆమె సేవలను గుర్తించిన బీజేపీ అధినాయకత్వం తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా నియమించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments