Telangana:ఖర్చులకు కూడా డబ్బులు లేవు.. తెలంగాణ అప్పులు ఎన్ని లక్షల కోట్లంటే..?
- IndiaGlitz, [Wednesday,December 20 2023]
రోజు వారీ ఖర్చులకి కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని.. ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం సభలో ప్రవేశపెట్టిన భట్టి.. గత ప్రభుత్వం చేసిన తప్పులు కారణంగా ఈ దారుణ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. 42పేజీల శ్వేత పత్రాన్ని విడుదల చేసిన ప్రభుత్వం సభ్యులకు అందజేసింది. గత పదేళ్లలో జరిగిన తప్పిదాలు ప్రజలకు స్పష్టంగా తెలియాలని అందుకే శ్వేతపత్రం ద్వారా వివరాలను వెల్లడించడం జరిగిందని ఆయన తెలిపారు.
శ్వేతపత్రం ఆధారంగా రాష్ట్రంలో మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. 2014-15 నాటికి రాష్ట్ర రుణం రూ. 72,658 కోట్లు ఉందని, 2014-15 నుంచి 2022– 23 మధ్య కాలంలో సగటున 24.5శాతం అప్పు పెరిగిందని పేర్కొన్నారు. 2023–24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లు. 2015–16లో రుణ, జీఎస్డీపీ15.7శాతంతో దేశంలోనే అత్యల్పమన్నారు. బడ్జెట్ కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం ఉందని రాష్ట్రం ఏర్పడిన తరువాత 10 రెట్లు రుణభారం పెరిగిందని భట్టి వివరించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ 42 పేజీల నోట్ ఇచ్చి 4 నిమిషాలు కూడా కాలేదు... దీన్ని చదవకుండా ఏం మాట్లాడాలి అధ్యక్షా? అని ప్రశ్నించారు. నోట్ ను చదవడానికి తమకు కొంత సమయం కావాలని చెప్పారు. అలాగే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు కూడా శ్వేతపత్రంపై ఆధ్యాయనం చేసేందుకు కనీసం గంట సమయం కావాలని కోరడంతో స్పీకర్ టీ బ్రేక్ ఇచ్చారు.