Karnataka Election Results : ఎగ్జిట్ పోల్స్ తారుమారు.. కాంగ్రెస్ ముందంజ, కర్ణాటకలో ‘‘ హంగ్ ’’ లేనట్లేనా..?

  • IndiaGlitz, [Saturday,May 13 2023]

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరో గంటలో పూర్తి ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వున్న ట్రెండ్స్‌ను పరిశీలిస్తే కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు స్పష్టం కనిపిస్తున్నాయి. రెండ్రోజుల క్రితం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ మెజారిటీ వస్తుందని.. కానీ హంగ్ తప్పదని దాదాపు అన్ని సర్వేలు అంచనా వేశాయి. కానీ శనివారం ట్రెండ్స్‌ను చూస్తే మాత్రం ఎగ్జిట్ పోల్స్ తారుమారైనట్లగా కనిపిస్తోంది. కాంగ్రెస్ దాదాపు 120 స్థానాల్లో ఆధిక్యంలో వుండగా.. బీజేపీ 70, జేడీఎస్ 30, ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో వున్నారు. కింగ్ మేకర్ అవుతుందని అంతా అనుకున్నా జేడీఎస్ ప్రభావం ఈసారి ఏం కనిపించలేదు. పాత మైసూరు ప్రాంతంలో తప్పించి.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో జేడీఎస్ పూర్తిగా చేతులెత్తేసింది.

జేడీఎస్ ఆశలపై నీళ్లు.. సెంటిమెంట్ రిపీట్ :

కర్ణాటకలో అధికార పార్టీ మరోసారి గెలవదన్న సెంటిమెంట్‌ను నిజం చేస్తూ ఫలితాలు వస్తున్నాయి. బెంగళూరు, సెంట్రల్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలలో బీజేపీ కాంగ్రెస్‌కు పోటీ ఇచ్చినప్పటికీ.. హస్తం జోరు కొనసాగుతోంది. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార్ని అందుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 113. కానీ కాంగ్రెస్ అంతకంటే ఎక్కువే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మిఠాయిలు పంచుకుని, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.

క్యాంప్ రాజకీయాలు మొదలు:

ఇకపోతే.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్‌లో, పీపీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపురాలో, మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణలో, చెన్నపట్టణ నుంచి మాజీ సీఎం కుమారస్వామి ఆధిక్యంలో వున్నారు. మరోవైపు.. గత అనుభవాలను దృష్టిలో వుంచుకుని ఆధిక్యంలో వున్న అభ్యర్ధులతో కాంగ్రెస్ హైకమాండ్ నిరంతరం టచ్‌లో వుంది. అవసరమైతే ఫలితాల తర్వాత ఎమ్మెల్యేలను క్యాంప్‌లకు తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు.