వైఎస్ జగన్‌.. నేను కలిసే ఉన్నాం.. మాకేం వివాదాల్లేవ్ : కేసీఆర్

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పోతిరెడ్డిపాడు వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంపై పరోక్షంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని కాస్త హెచ్చరిస్తూనే కేసీఆర్ మాట్లాడారు. అంతేకాదు ఇదివరకు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు అస్తమాను ఇలాగే నీళ్ల విషయంలో బస్తీమే సవాల్ అనేవారని తద్వారా సాధించిందేమీ లేదని.. ఆఖరికి ఒక్క టీఎంసీ కూడా వాటర్ సాధించలేకపోయారన్న విషయాన్ని ఉదహరించారు. అందుకే ప్రేమాస్పదంగా వివాదాన్ని పరిష్కరించుకుందామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. నీటి వాటాలపై తమకు స్పష్టమైన అవగాహన ఉందని.. తమకున్న కేటాయింపుల ప్రకారమే వాడుకుంటున్నామని అని కేసీఆర్ స్పష్టం చేశారు. రాయలసీమకు నీళ్లు అవసరమైతే గోదావరి నుంచి తీసుకెళ్లండి అంతేకానీ తెలగాణ ప్రజలకు భంగం కలిగిస్తే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదని కేసీఆర్ ఒకింత హెచ్చరించారు.

నాకు బాగా తెలుసు..!

‘పోతిరెడ్డిపాడు గురించి ఇప్పుడు మాట్లాడదలచుకోలేదు. టైమ్ వచ్చినప్పుడు నేనే మాట్లాడుతాను. ఏపీ ప్రభుత్వం ఇప్పుడే లేఖ రాసింది. దానిపై అధ్యయనం చేస్తున్నాం. మేం చట్టం పరిధిలో మా ప్రజలకు న్యాయం చేయడానికి మాకున్న పరిధిలో మేం కట్టుకుంటున్నాం. మేం ఎక్కడా నిబంధనలు ఉల్లఘించలేదు. నేను ధైర్యమున్న మనిషిని.. నేనేం పిచ్చిపిచ్చిగా అల్లాటప్పాగా మాట్లాడే మనిషిని కాదు. ఎందుకంటే నాకు విషయం, భౌగోళిక పరిజ్ఞానం ఉంది. ప్రజలకు ఏం అవసరమో నాకు బాగా తెలుసు. మాకున్న వాటా పరిధిలోనే ప్రాజెక్టులు కట్టుకున్నాం. గోదారి జలాలపై ఈ మధ్యే నేను కమిటీ వేశాను. గోదావరిలో మా వాటా పోనూ మాకు 650 టీఎంసీలు సర్‌ప్లస్ వాటర్ కావాలని కోరుతున్నాం. మాకు తాగు, సాగు, పరిశ్రమలకు ఇలా దేనికైనా గోదావరి నీళ్లు తప్ప మరో దిక్కు లేదు. మేం గోదావరి బేసిన్‌లోనే ఉన్నాం. దాదాపు 500 కిలోమీటర్ల పై చిలుకు గోదావరి రాష్ట్రంలో ప్రవహిస్తుంది. దానిపై మాకూ హక్కుంది. మాకు మా వాటా 950 టీఎంసీలు కాకుండా మరో 650 టీఎంసీలు సర్‌ప్లస్ వాటర్ కేటాయించమని మేం కోరుతున్నాం. ఎప్పుడో కోరాం.. కానీ ఇప్పుడు తాజాగా కమిటీని కూడా వేశాం.. ఇది మా తెలంగాణ పరిస్థితి’ అని కేసీఆర్ సునిశితంగా వివరించారు.

రాయలసీమకు నీళ్లు పోవాల్సిందే..

‘ కచ్చితంగా రాయలసీమకు నీళ్లు పోవాల్సిందే. గోదావరి నీళ్లు సముద్రానికి వెళ్తున్నాయ్.. తీసుకెళ్లండని ఏపీకి చెప్పాను. ఇది మంచి మాటే కదా.. మేం పిచ్చి లొల్లి పెట్టం.. మేం కచ్చితంగానే ఉంటాం. అందుకే మాకు ప్రజలు మద్దతిచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన వారందర్నీ పిలిచి మరీ భోజనం పెట్టి గోదావరి జలాల గురించి మాట్లాడాం. మాకు బేసిన్లు లేవ్.. భేషజాలు లేవ్.. బ్రహ్మాండంగా నీళ్లు వాడుకోండి.. మేం వాడుకుంటాం. ఇరు రాష్ట్రాలకు సరిపోయి మరీ వెయ్యి టీఎంసీలు నీళ్లు మిగిలే ఉన్నాయ్.. పిచ్చి కొట్లాటలు వద్దని చెప్పాను. ఏదైనా సరే సామరస్యంగా చేసుకోవాలి. పంచాయితీలు పెట్టడం వల్ల ఏం సాధించారు.. అప్పటి ముఖ్యమంత్రి హడావుడి చేశారు.. ఏం సాధించాడు..?. రాయలసీమ వరకు కావాల్సినంత నీళ్లు గోదావరి నుంచి తీసుకెళ్లండి. మీరు కడుపునిండా తీసుకెళ్లండి అని చెప్పాను. మాతో పాటు మీరూ తీసుకోమని చెప్పాం. కానీ అలా కాదు నేను వేరే రకంగా తీసుకుంటానంటే మాత్రం.. దీని వల్ల రాష్ట్రానికి భంగం వస్తే మాత్రం అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు.. క్షమించం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద రాజీపడే ప్రసక్తేలేదు. ఎవరు మిగులు జలాలు వాడుకోవాలన్నా గోదావరిలో ఉన్నాయ్.. ఆ నీళ్లు వాడుకుంటే మాకు అభ్యంతరాల్లేవ్. ఈ విషయాన్ని నేను చాలా సార్లు చెప్పాను. చిల్లర పంచాయితీలతో సాధించేది తక్కువ.. ప్రేమాస్పదంగా చేసుకుందామని చెప్పాం. దానికి మేం కట్టుబడే ఉన్నాం. కొందరిలాగా మాకు రెండు నాల్కలు ఉండవ్’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

మేం కలిసే ఉన్నాం..!

కాగా తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నడుస్తోందని.. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య విబేధాలు వచ్చాయ్ దీనిపై మీరేమంటారు..? అని కేసీఆర్ మీడియా మిత్రులు ప్రశ్నించారు. దీనిపై చాలా లాజిక్‌గా కేసీఆర్ సమాధానమిచ్చారు. ‘జగన్-నేను ఇద్దరం కలిసే ఉన్నాం. కలిసే పనిచేస్తున్నాం. మాకేం వివాదాల్లేవ్. మేం అన్యోన్యంగా కలిసే ఉన్నాం.. కలిసే ముందు కూడా ఉంటాం. మేం అన్యోన్యంగా ఉన్నామని కొంత మంది కళ్లేమైనా మండుతున్నాయా..?. మేమిద్దరం మంచిగానే ఉన్నాం’ అని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.