Chandrababu-Lokesh:అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు లోకేశ్.. అక్కడే పాదయాత్ర ముగింపు..

  • IndiaGlitz, [Monday,December 18 2023]

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద యాత్రను ముగించనున్నారు. ఈనెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద యువగళం పాదయాత్ర జైత్రయాత్ర విజయోత్సవ సభను నిర్వహించనున్నారు. ఈ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలిరానున్నారు. ఇందుకోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేయటం విశేషం. దాదాపు 5 లక్షలమంది ఈ సభకు వస్తారని అంచనా వేస్తోంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర.. మొత్తం 97 నియోజకవర్గాల్లో 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా 226రోజులు పాటు 3,132 కిలో మీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది. ప్రతి జిల్లాలోనూ లోకేశ్ పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ఉమ్మడి జిల్లాల వారీగా పాదయాత్ర ఇలా సాగింది..

చిత్తూరులో 14 నియోజకవర్గాల్లో 45రోజుల పాటు 577 కిలో మీటర్లు
అనంతపురం జిల్లాల్లో 9 నియోజకవర్గాల్లో 23రోజుల పాటు 303 కిలో మీటర్లు
కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 40రోజుల పాటు 507 కిలో మీటర్లు
కడప జిల్లాలో 7 నియోజకవర్గాలు 16రోజులుపాటు 200 కిలో మీటర్లు
నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 31రోజులుపాటు 459 కిలో మీటర్లు
ప్రకాశం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో 17రోజులపాటు 220 కిలోమీటర్లు
గుంటూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో 16రోజులుపాటు 236 కిలోమీటర్లు
కృష్ణా జిల్లాలో 6 నియోజకవర్గాల్లో 8రోజులుపాటు 113 కిలోమీటర్లు
పశ్చిమగోదావరి జిల్లాలో 8 నియోజకవర్గాల్లో 11రోజులుపాటు 225.5 కిలోమీటర్ల
తూర్పుగోదావరి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 12రోజులుపాటు 178.5 కిలోమీటర్లు
విశాఖ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 7రోజులుపాటు 113 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.

అదే సెంటిమెంట్‌తో అగనంపూడిలోనే..

కాగా 11ఏళ్ల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ‘వస్తున్నా మీకోసం’పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభమైన చంద్రబాబు యాత్ర 208 రోజుల పాటు యాత్ర సాగింది. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,817 కిలో మీటర్లు ఆయన నడిచారు. 2013 ఏప్రిల్ 28న విశాఖలోని అగనంపూడి వద్ద పాదయాత్ర ముగించారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికలలో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అదే సెంటిమెంట్‌తో ప్రస్తుతం లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కూడా విశాఖలోని అగనంపూడిలోనే ముగియనుంది. దీంతో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించండ ఖాయమని తెలుగు తమ్ముళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.