Theenmar Mallanna:ఎన్నికల వేళ కీలక పరిణామం.. కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. తాజాగా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అబ్జర్వర్ బోస్ రాజు, సీడబ్ల్యూసీ సభ్యుడు గురుదీప్ సిప్పల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో హస్తం పార్టీలో మరింత జోష్ పెరిగింది.
కొంతకాలంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను నిజం చేస్తూ ఆయన కాంగ్రెస్‌లో చేరారు. తొలి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మల్లన్న పోరాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో పలు మార్లు జైలుకు కూడా వెళ్లారు. అంతకుముందు జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఆయనకు ఓట్లు పడటం విశేషం. ఆ తర్వాత బీజేపీలో చేరి మళ్లీ బయటకు వచ్చేశారు. ఇక ఇటీవల మేడ్చల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మంత్రి మల్లారెడ్డిని ఓడిస్తానని ప్రకటిచారు. ఈ తరుణంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.
తీన్మార్ మల్లన్న రాకతో పార్టీకి మరింత బలం చేకూరందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా వ్యతిరేకించడంలో మల్లన్న ముందువరుసలో ఉంటారని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి, ఆరాచకాలపై ఓ జర్నలిస్ట్‌గా తనదైన శైలిలో వాడివేడి విమర్శలు చేస్తూ ప్రజల్లో చైతన్య తెచ్చే ప్రయత్నంలో ఆయన విజయవంతం అయ్యారంటున్నారు. యువతలో మంచి క్రేజ్ ఉన్న మల్లన్న పార్టీలో చేరడం శుభపరిణామని భావిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments