ఏ క్షణమైనా థియేటర్లు మూతపడతాయట...
- IndiaGlitz, [Wednesday,March 24 2021]
మళ్లీ పరిస్థితులు మొదటికి వస్తున్నాయి. గత ఏడాది మార్చిలో మొదలైన అనూహ్య పరిస్థితులు.. తిరిగి ఈ ఏడాది మార్చిలో పున: ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా మార్చి వచ్చేనాటికి కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభించేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు ఆయా ప్రభుత్వాలు సెలవులు ప్రకటించేశాయి. ఇక గతేడాది కరోనా మహమ్మారి కారణంగా దారుణంగా నష్టపోయిన పరిశ్రమ సినీ పరిశ్రమ. ఇప్పుడిప్పుడే కోలుకుని సాధారణ స్థితికి వస్తున్న తరుణంలో తిరిగి కరోనా మహమ్మారి విజృంభించింది. ఈ పరిస్థితుల్లో మరోసారి లాక్‌డౌన్, కర్ఫ్యూ అంటున్నారు. ఇది ఉంటుందా? ఉండదా? అనే విషయాన్ని పక్కనబెడితే కరోనా విజృంభించిందంటే మాత్రం సినీ పరిశ్రమకు మరోసారి దారుణమైన దెబ్బ తగిలే అవకాశం ఉంది.
థియేటర్లు తెరుచుని.. 50 శాతం ఆక్యుపెన్సీని దాటుకుని.. ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకుని పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు యాజమాన్యాలు యత్నిస్తున్నాయి. పైగా వచ్చే నెల నుంచి అందరు పెద్ద హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో మరోసారి థియేటర్లు మూతపడే అవకాశముందని టాక్ బలంగానే వినిపిస్తోంది. ఏ క్షణమైనా థియేటర్లు మూతపడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే కొందరు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటున్నారని కూడా టాక్ నడుస్తోంది. ఈమేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఒకవేళ థియేటర్లు పూర్తిస్థాయిలో మూసివేత సాధ్యం కాకుంటే సగం సీట్లు మాత్రమే నింపుకునేలా నిబంధనలు విధించాలని సూచించింది.
తెలంగాణలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే చేయి దాటిపోయే ప్రమాదం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతుండటం.. థియేటర్లు పూర్తి స్థాయిలో నిండిపోవడం.. ప్రేక్షకులు సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. పైగా తలుపులన్నీ మూసివేసి ఏసీ వేస్తుండటంతో కేసులు భారీగా పెరుగుతున్నాయన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమా హాళ్లు, జిమ్‌లు, ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న సముదాయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే థియేటర్ల భవిత ఆధారపడి ఉంది.