నేడు గ్రేటర్ పరిధిలో బొమ్మ పడనుంది...

  • IndiaGlitz, [Friday,December 04 2020]

కొవిడ్‌ మహమ్మారి కారణంగా మూతపడిన మల్టీప్లెక్స్‌లు ఎట్టకేలకు శుక్రవారం తెరుచుకోనున్నాయి. ఎనిమిది నెలల సుదీర్ఘ విరామం అనంతరం నేటి ఉదయం తెరపై బొమ్మ పడనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఎనిమిది మల్టీపెక్స్‌ల్లో 20 స్ర్కీన్లను ప్రారంభించేందుకు నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా థియేటర్లను ఓపెన్ చేయనున్నారు. హైదరాబాద్‌లో పది చోట్ల పీవీఆర్‌ మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. కాగా.. మాదాపూర్‌, ఎర్రమంజిల్‌, పంజాగుట్ట, మూసారాంబాగ్‌, మల్లాపూర్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లో సినిమా ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి.

కొవిడ్‌ నేపథ్యంలో జంట నగరాల పరిధిలోని సినిమాహాళ్లు, మల్లీప్లెక్ల్స్‌ థియేటర్లు సహా సర్వం మూతపడ్డాయి మార్చి 16వ తేదీన మూసివేశారు. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా సినిమా థియేటర్లు మినహా అన్ని పరిశ్రమలు, సంస్థలు చాలా రోజుల క్రితమే తెరుచుకున్నాయి. తాజాగా మల్టీప్లెక్స్‌ల ప్రారంభానికి రంగం సిద్ధమైంది. కొవిడ్‌ నిబంధనల మేరకు 50 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నారు. కాగా.. ప్రస్తుతం 20 స్ర్కీన్లను మాత్రమే ప్రారంభిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో స్క్రీన్లను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి స్ర్కీన్‌లో 50 శాతం సీట్లకు మాత్రమే టికెట్లు ఇస్తామని చెప్పారు. రోజుకు 4 షోలు ఉంటాయని, ప్రతి షో తర్వాత థియేటర్‌ను పూర్తిగా శానిటైజ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.