అక్కడ మాత్రం ఇంకా థియేటర్లకు గడ్డుకాలమే..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజల జీవనస్థితిగతులు తలకిందులైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే థియేటర్లకు గడ్డుకాలం దాపురించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. కానీ తమిళనాడులో మాత్రం ఇంకా థియేటర్లు గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటున్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు ఏమాత్రం
ఆసక్తి చూపడం లేదు. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చిలో థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఈ లాక్డౌన్ ప్రభావం ముఖ్యంగా సినీ పరిశ్రమపై దారుణంగా పడింది. కోలుకోలేని విధంగా నష్టపోయింది.
అయితే ఇటీవలే థియేటర్లు తెరుచుకున్నప్పటికీ తమిళనాడులో యాజమాన్యాల కష్టాలు మాత్రం గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. గత యేడాది డిసెంబరు మూడో వారం నుంచి థియేటర్లు 50 శాతం ప్రేక్షకుల సామర్థ్యంతో తెరుచుకున్నాయి. జనవరిలో పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతించారు. అయినప్పటికీ పెద్ద హీరోల సినిమాల విడుదల సమయంలో మాత్రమే థియటర్ల వద్ద సందడి కనిపిస్తోంది. చిన్న హీరోలు, చిన్న బడ్జెట్ చిత్రాల విడుదల సమయంలో థియేటర్ వైపు ప్రేక్షకులు కన్నెత్తి కూడా చూడటం లేదు. అదేసమయంలో పలు మల్టీప్లెక్స్‌లలో ఉన్న పెద్ద థియేటర్లు ఇప్పటికే తెరుచుకోలేదు.
పెద్ద హీరోల చిత్రాలు పెద్దగా విడుదలకు నోచుకోకపోవడమే థియేటర్లు తెరుచుకోకపోవడానికి కారణంగా తెలుస్తోంది. పెద్ద హీరోలంతా సమ్మర్, దసరా పండుగను టార్గెట్ చేస్తున్నారు తప్ప తాజాగా అయితే విడుదలకు నో చెబుతున్నారు. దీంతో ప్రేక్షకులు సైతం పెద్దగా థియేటర్ల వైపు చూడటం లేదు. చెన్నై నగరంలో ప్రముఖ మల్టీ కాంప్లెక్స్‌గా పేరొందిన థియేటర్లు, మాల్స్‌లోని ఎక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగిన థియేటర్లలో బొమ్మ పడటం లేదని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఒక వేళ కొన్ని మల్టీప్లెక్స్‌లలో సినిమాలు ప్రదర్శించినా ప్రేక్షకుల సంఖ్య వందకు మించడం లేదు. దీంతో థియేటర్ యజమానులు సైతం మల్టీప్లెక్స్‌లలోని తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లలోనే సినిమాలను ప్రదర్శిస్తున్నారు. మున్ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout