YS Viveka:వివేకా హత్య కేసు .. నాలుగేళ్లుగా ఏం తేల్చింది, సీబీఐ ట్రాక్ తప్పిందంటూ ఎండగట్టిన 'ది వైర్'

  • IndiaGlitz, [Monday,July 24 2023]

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. సింపుల్‌గా (సీబీఐ). ఈ పేరు వినగానే మిస్టరీ కేసులను విప్పిన వైనం, అంతుచిక్కని నేరాల్లో నేరస్తులను పట్టుకున్న నేర్పరితనం అన్ని గుర్తొస్తాయి. దేశ ప్రజల్లో సీబీఐపై వున్న అభిమానం సాధారణమైంది కాదు. దేశ యువతలో చాలామందికి సీబీఐలో అధికారి కావాలన్నది కల. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థకు ప్రభ క్రమేణా మసకబారుతోంది. కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందన్న విమర్శలు యూపీఏ హయాం నుంచి మొదలైంది. తమ రాజకీయ ప్రత్యర్ధులను గుప్పెట్లో పెట్టుకుని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని అస్త్రంగా వాడింది. దీనికి తోడు కేసులను వేగంగా ఛేదించలేకపోతోంది. దీనికి రాజకీయ పరమైన ఒత్తిడి కూడా ఓ కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. సీబీఐ సమర్థతపై ఆంగ్ల వెబ్‌సైట్ ‘‘ ది వైర్’’ విమర్శనాత్మక కథనాన్ని ప్రచురించింది.

ఏపీని ఉలిక్కిపడేలా చేసిన వివేకా హత్య :

సీబీఐపై తీవ్ర విమర్శలు రావడానికి కారణమైన కేసుల్లో ‘‘వైఎస్ వివేకానందరెడ్డి’’ హత్య కేసు కూడా ఒకటి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌తో పాటు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వివేకా హత్య జరిగిన నాలుగున్నరేళ్లు గడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో సీబీఐ విఫలమైంది. పేజీలకొద్దీ ఛార్జ్‌షీట్‌లు సమర్ధిస్తున్నా.. ఆయన హత్యకు దారి తీసిన కారణాలు, నేరస్తులు ఎవరన్నది మాత్రం ఇంత వరకు సీబీఐ పట్టుకోలేకపోయింది. దర్యాప్తు మొత్తం ఒకే కోణంలో సాగిందని, వేరే కోణం దిశగా వెళ్లాలన్న ప్రయత్నాలను సైతం సీబీఐ చేయలేదని ది వైర్ తూర్పారబట్టింది. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ.. ముందుగానే నిందితుడిని సెలెక్ట్ చేసుకుని అతనినే నిందితుడిగా రుజువు చేసేందుకు సీబీఐ ఆధారాలు వెతుకుతోందని ది వైర్ ఆరోపించింది.

అవినాష్ రెడ్డిని ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసిన సీబీఐ :

ఈ కేసులో సీబీఐ తొలి నుంచి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డినే ప్రధాన నిందితుడిగా అనుమానిస్తోంది. ఎంపీ టికెట్ విషయంలోనే వివేకా హత్య జరిగి వుండొచ్చని సీబీఐ వాదిస్తోంది. కానీ అప్పటికే అవినాష్ రెడ్డిని వైసీపీ తరపున కడప ఎంపీగా ప్రకటించారు జగన్. అధినేత ప్రకటన మేరకు వివేకా సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మరి సీబీఐ ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదనే వాదన వుంది. కేవలం ఎంపీ టికెట్ కోసమే వివేకా, అవినాష్ రెడ్డి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని భావిస్తూ ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తూ వెళ్ళింది. కానీ దీనిని రుజువు చేసేలా ఒక్క ఆధారమూ సంపాదించలేకపోయింది. ఈ కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిపైనా అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేసిన సీబీఐ ఆయనకు ఈ హత్యతో ప్రమేయం ఉందని చెప్పే ఒక్క ఆధారమూ కోర్టుకు చూపలేదు.

షర్మిల వాంగ్మూలం .. ఆధారాలు చూపని సీబీఐ:

కడప ఎంపీ టికెట్ విషయంలో వైఎస్ షర్మిల ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్‌గా తీసుకుని సీబీఐ విచారిస్తూ వెళ్లింది. అవినాష్ రెడ్డి ఎంపీ అభ్యర్ధిగా సరైన వ్యక్తి కాదని వివేకా భావించారని షర్మిల చెప్పారని దానినే పట్టుకుని ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో సీబీఐ ఓ విషయాన్ని మరిచిపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 1. 90 వేల ఓట్ల మెజారిటీతో.. 2019లో 3.80 లక్షల ఓట్ల మెజారిటీతో అవినాష్ రెడ్డి గెలిచారు. క్రమేణా ఆయన మెజారిటీ పెరిగిందే తప్ప తగ్గలేదు. మరి అలాంటపుడు అవినాష్ రెడ్డి బలహీనమైన అభ్యర్థి అని వివేకా ఎలా భావిస్తారన్న దానికి సీబీఐ వద్ద సమాధానం లేదు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్ రెడ్డి కారణమన్న దానికీ ఆధారాలు లేవు.

వివేకా రెండో పెళ్లి , ఆర్ధిక లావాదేవీలను పట్టించుకోని సీబీఐ :

ఇక వివేకా హత్య కేసు దర్యాప్తులో ఆయన రెండో పెళ్లి విషయం వెలుగులోకి రావడం మరింత సంచలనం సృష్టించింది. షమీమ్ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకోవడం ఆయన భార్య సౌభాగ్యమ్మకు, కుమార్తె సునీతకు ఇష్టం లేదన్న సంగతి పులివెందులలో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే వివేకా చెక్ పవర్‌ను కూడా తల్లీకూతుళ్లు లాగేసుకున్నారని స్థానికులు చెబుతారు. మరి ఆ దిశగా సీబీఐ ఎందుకు విచారించలేదనే విమర్శలు వస్తున్నాయి. వివేకా హత్యకు ఎంతసేపటికీ రాజకీయ పరమైన కారణాలనే అన్వేషిస్తోన్న సీబీఐ.. ఆర్ధిక లావాదేవీల కోణంపై ఎందుకు విచారించలేదు. ఇలా విభిన్న కోణాల్లో జరగాల్సిన విచారణ కేవలం వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూనే ఎందుకు తిరిగింది. ఆయనను నిందితుడిగా నిరూపించడానికి సీబీఐ ఎందుకు అంతలా తహతహలాడిందని ది వైర్ ప్రశ్నించింది. ఇలా ఎన్నో అంశాలను వదిలేసి.. చిక్కుముడిని విప్పకుండా సీబీఐ దర్యాప్తు బృందం తన ట్రాక్ తప్పిందని వైర్ దుయ్యబట్టింది.

ఎస్పీ రామ్‌సింగ్‌పై అవినాష్ రెడ్డి ఫిర్యాదు :

ది వైర్ కథనం వైరల్ అవుతున్న దశలో వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ సరిగా సాగలేదంటూ వైఎస్ అవినాష్ రెడ్డి ఏకంగా సీబీఐ డైరెక్టర్‌కు ప్రవీణ్ సూద్‌కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌పై అవినాష్ ఫిర్యాదు చేశారు. పూర్తి పక్షపాతంతో ఆయన విచారణ నిర్వహించారని, రామ్ సింగ్ చేసిన దర్యాప్తును సమీక్షించాలని ఎంపీ కోరారు. వివేకా రెండో వివాహం, బెంగళూరు ల్యాండ్ సెటిల్‌మెంట్, రెండో భార్య పేరిట వున్న ఆస్తిపత్రాల చోరీ వంటి కోణంలో విచారణ జరగలేదని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. నిజమైన నేరస్తులను పట్టుకుని న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేయడం కొసమెరుపు. మరి ఎంపీ లేఖపై సీబీఐ డైరెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికైనా సీబీఐ తనపై వస్తోన్న విమర్శలకు స్పందించి.. తన ఘనకీర్తిని , సమర్ధతను నిలబెట్టుకోవాలని విమర్శకులు కోరుతున్నారు.

More News

Vrushabha:మోహన్‌లాల్ పాన్ ఇండియా మూవీ ‘‘వృషభ’’ మొదలు.. ది కంప్లీట్ స్టార్‌తో మేకా రోషన్, క్యాస్టింగ్ ఇదే

ప్రస్తుతం బాలీవుట్ నుంచి కోలీవుడ్ వరకు పాన్ ఇండియా మూవ్‌మెంట్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

Thiruveer:హ్యాపీ బ‌ర్త్ డే టు వెర్స‌టైల్ యాక్ట‌ర్ తిరువీర్‌.. ‘మిషన్ తషాఫి’లో తిరువీర్ క్యారెక్ట‌ర్‌ను అనౌన్స్ చేసిన జీ 5

తిరువీర్‌.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటూ విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు.

Natho Nenu Review: ‘నాతో నేను’ మూవీ రివ్యూ

దాదాపు దశాబ్ధ కాలంగా తెలుగువారికి నవ్విస్తున్న జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కళాకారులు పరిచయమయ్యారు.

Pawan Kalyan :మైడియర్ వాట్సన్ .. ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పు , జగన్ టార్గెట్‌గా వాలంటీర్లపై పవన్ మరో ట్వీట్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

YS Jagan:జగన్ నాలుగేళ్ల కష్టానికి ప్రతిఫలం.. ఏపీలో తగ్గుతోన్న పేదరికం, నీతి ఆయోగ్ ప్రశంసలు

భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంతిమ ధ్యేయం పేదరికాన్ని రూపుమాపడమే. ఇందుకోసం ఎన్నో విధాన నిర్ణయాలు,