ఓ చిన్నారి కోసం ట్రైన్ ఏకంగా 240 కి.మీ ఆగకుండా ప్రయాణించింది..

  • IndiaGlitz, [Tuesday,October 27 2020]

కొన్నిసార్లు ప్రజల రక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం చేసే పనులు చాలా ఆసక్తికరంగానూ.. చరిత్రలో నిలిచిపోయేవిగానూ ఉంటాయి. ఓ చిన్నారి కోసం రైల్వే యంత్రాంగం చేసిన పని కూడా ఇలాంటిదే. ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి ట్రైన్‌లో పారిపోతున్న కిడ్నాపర్ కోసం ట్రైన్‌ను ఏకంగా 241 కిలో మీటర్ల పాటు ఎక్కడా ఆపకుండా పరుగులు పెట్టించారు. అసలు విషయంలోకి వెళితే.. భోపాల్‌లోని లలిత్‌పూర్ రైల్వేస్టేషన్‌లో మూడేళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో ఆ తల్లి వెంటనే లలిత్‌పూర్ ఆర్పీఎఫ్ పోలీసులను ఆశ్రయించింది.

తన కూతురును ఎవరో అపహరించి ఉంటారనే అనుమానాన్ని ఆ తల్లి వ్యక్తం చేసింది. వెంటనే అలర్ట్ అయిన ఆర్పీఎఫ్ సిబ్బంది. సీసీ కెమెరాలను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి చిన్నారిని ఎత్తుకుని రఫ్తీసాగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కినట్టు పోలీసులు గుర్తించారు. కానీ అప్పటికే ట్రైన్ స్టేషన్‌ నుంచి వెళ్లిపోయింది. ఎలాగైనా ఆ పాపను రక్షించాలని ఆర్పీఎఫ్ సిబ్బంది భావించారు. రైలు ఎక్కడ ఆగినా పాప దొరకడం కష్టమని భావించారు. వెంటనే ఆర్పీఎఫ్ ఇన్స్‌పెక్టర్ రైల్వే కంట్ర‌ోల్, ఉన్నతాధికారులకు ట్రైన్‌ను ఎక్కడా ఆపవద్దని విజ్ఞప్తి చేశారు.

అధికారులంతా దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్నారు. సంబంధిత అధికారులంతా చిన్నారిని రక్షించేందుకు ముందుకు వచ్చారు. ట్రైన్ ఎక్కడా ఆగకుండా క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో రైలు మధ్యలో ఎక్కడా ఆగలేదు. ట్రైన్ 241 కిలో మీటర్లు ప్రయాణించిన మీదట.. నేరుగా భోపాల్‌ రైల్వే స్టేషన్‌లో ఆగింది. అప్పటికే భోపాల్‌లోని ఆర్పీఎఫ్ సిబ్బందిని అధికారులు అలర్ట్ చేశారు. దీంతో అప్పటికే ఆర్పీఎఫ్ సిబ్బందంతా భోపాల్ రైల్వే స్టేషన్‌‌కు చేరుకుంది. ఆ కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రయాణికులతోపాటు అక్కడి వారంతా రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్‌ సిబ్బందిని అభినందించారు. ఇలాంటి ఘటన రైల్వే చరిత్రలోనే మొదటిసారని అధికారులు తెలిపారు.