ఇవాళ ‘మునిగిన బోటు’ బయటికొచ్చే అవకాశం!

  • IndiaGlitz, [Sunday,October 20 2019]

తూర్పుగోదారి జిల్లా కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటును ఇవాళ సాయంత్రం బయటికి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆదివారం నాడు కచ్చులూరు వద్దకు డీప్ వాటర్ డ్రైవర్స్ చేరుకున్నారు. ఘటన స్థలాన్ని మెరైన్ కెప్టెన్ ఆదినారాయణ సహాయంతో డైవర్స్ పరిశీలిస్తున్నారు. నీటిలోకి దిగి ట్రయిల్ ఆపరేషన్ ప్రారంభించారు. తర్వాత పూర్తి స్థాయి పనులు చేపట్టి బోటుకి ఐరన్ రోప్ లంగర్ వేసి వలయాకారంగా చుట్టి బయటకు తీసే ప్రయత్నం చేయనున్నారు. అయితే ఈ పది మంది డ్రైవర్స్‌లో ఇద్దరు నది అడుగు భాగంలోకి వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారు.

ఇవాళ సాయంత్రానికి బోటొచ్చేస్తుంది!

బోట్ మునిగిన ప్రాంతంలో నదీ గర్భం V ఆకారంలో ఉందని వారు తెలిపారు. మరలా ఐరన్ రోప్‌ను తీసుకుని బోట్‌ని బంధించేందుకు నీటిలోకి డ్రైవర్స్ వెళ్లారు. ప్రస్తుతం బోటు కేవలం 38 అడుగులు లోతులో, నది ఒడ్డుకు 180 అడుగుల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.

బోటును మరో 20 మీటర్లు మేర ఒడ్డు వైపునకు తీసుకొస్తే బోటును సునాయాసంగా ఒడ్డుకు చేర్చవచ్చు.

అన్నీ అనుకూలిస్తే ఈ రోజు సాయంత్రమే బోటు బయటకు వచ్చే అవకాశం ఉందని డీప్ డ్రైవర్స్ చెబుతున్నారు.

కాగా.. ఇవాళ ఉదయం బోటు వెలికితీతకు గాను దుబాసీల బృందం విశాఖ నుంచి దేవీపట్నం చేరుకుంది. ధర్మాడి సత్యం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కచ్చులూరు వెళ్లేందుకు బోటు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. నదిలోకి వెళ్లి బోటుకు లంగర్లు తగిలించి వెలికితీస్తామని దుబాసీలు చెప్పగా పోలీసులు నో చెప్పారు. ఇదిలా ఉంటే.. రాయల్‌ వశిష్ఠ బోటు నుంచి.. గాలింపు చర్యల్లో భాగంగా శనివారం ఓ లైఫ్‌బాయ్‌ దొరికిన సంగతి తెలిసిందే.