YSRCP: వైసీపీలో పెరుగుతున్న ధిక్కార స్వరాలు.. పార్టీకి మైనస్ కానున్నాయా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎమ్మెల్యేల మార్పు అంశం వైసీపీలో రోజురోజుకు తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. ఎప్పుడూ ఏ నేత పార్టీ మారతారో.. ఎవరూ పార్టీపై ధిక్కార వ్యాఖ్యలు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ పార్టీకి రాజీనామా చేయగా.. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఏకంగా పార్టీ అధినేత, సీఎం జగన్(CM JAGAN)పైనే ధిక్కార వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు(Ms Babu) కూడా పార్టీ అధిష్టానంపై మండిపడ్డారు.
దళితులకు పార్టీ టికెట్ల విషయంలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నానని.. ఇప్పుడు తనపై వ్యతిరేకత ఉంటే ఎవరిది బాధ్యత? అని నిలదీశారు. ఓసీ సీట్లు ఒక్క చోటా మార్చకుండా కేవలం ఎస్సీ సీట్లే మారుస్తున్నారని... ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓసీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు. ఐదేళ్లలో సీఎం జగన్ ఒక్కసారి కూడా తనను పిలిచి మాట్లాడలేదని వాపోయారు. కేవలం దళిత నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదంటూ ఎందుకు టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని తెలిపారు. ఓసీలను ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఐప్యాక్ సర్వేల ద్వారానే టికెట్లు ఇచ్చారా? డబ్బులు ఇస్తే ఐప్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారన్నారని ఆరోపించారు. అయితే తాను పార్టీలోనే కొనసాగుతానని తనకు న్యాయం చేస్తారని పార్టీ పెద్దలపై నమ్మకం ఉందని ఆయన వెల్లడించారు.
అంతకుముందు కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి(Parthasarathi) మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ సీఎం జగన్ తనను గుర్తించకపోయినప్పటికీ.. పెనమలూరు నియోజకవర్గ ప్రజలు మాత్రం తనను గుర్తించారని తెలిపారు. పార్టీలో తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పారు. తాను ఎక్కడ ఉన్నా పెనమలూరు ప్రజలకు రుణపడి ఉంటానని వివరించారు. దీంతో వేదికపై ఉన్న మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) కోపంతో కిందకు దిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం పార్థసారథి వ్యాఖ్యలు వైసీపీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్న పార్థసారథి ఆయనపైనే అసంతృప్తి వ్యక్తం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఇక గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు(Anna rambabu) కూడా పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. పార్టీలోని ముఖ్య సామాజికవర్గం తనను టార్గెట్ చేసిందని.. ఆ చాలా ఇబ్బందులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ నేతలకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. ఈ క్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏం చేసిందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించవద్దని.. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతటా పర్యటిస్తానని సవాల్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్(Vamsi Krishna yadav)వైసీపీకి రాజీనామా చేసిన జనసేనలో చేరిపోయారు. అంతేకాకుండా ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో తెలియజేస్తూ సీఎం జగన్‌కు 11 పేజీల లేఖ రాశారు. కష్టపడి పనిచేసినా గుర్తించలేదని.. కనీసం మనిషిగా కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేయడం వెనుక.. ఎంతో ఆవేదన, ఎన్నో అవమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీ కోసం ఖర్చుపెడితే చివరకు క్వారీ వ్యాపారాన్ని కూడా దెబ్బతీశారని వాపోయారు. పెద్దిరెడ్డి, ధనుంజయరెడ్డికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. పార్టీ కోసం శ్రమించినందుకు 25 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అందరికంటే ముందుగా సీఎం జగన్ సన్నిహితుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) ఏకంగా ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసి సంచలనం రేపారు. మంగళగిరి అభివృద్ధికి నిధులు కేటాయించమన్నా.. ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. తన సొంత డబ్బులతో పనులు చేయించి అప్పులు పాలయ్యాయని వాపోయారు. అంతేకాకుండా వైయస్ షర్మిల(YS Sharmila)తో నడుస్తానని.. తప్పు చేస్తే జగన్‌పై కూడా కోర్టుల్లో కేసులు వేస్తానని చెప్పడం వైసీపీలో కాక రేపింది.
ఇలా నేతలందరూ ఒక్కొక్కరిగా బయటకు వస్తూ అధినేత జగన్‌తో పాటు పార్టీ పెద్దలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు ఏర్పాటుచేసుకుని ఎమ్మెల్యేలుగా తమకు అధికారం లేకుండా చేశారని మండిపడుతున్నారు. మరి అలాంటప్పుడు పనితీరు బాలేదంటూ తమను ఎలా మారుస్తారని నిలదీస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్యేల మార్పు నిర్ణయం అధికార వైసీపీలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఈ అసంతృప్తులను జగన్ ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com