close
Choose your channels

అసలు సిసలు ట్రెండ్ సెట్టర్

Monday, May 28, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు చలన చిత్రసీమలో అసలు సిసలు 'ట్రెండ్ సెట్టర్' అంటే యన్టీఆర్ అని అందరికీ తెలుసు. ఇప్పటికీ ఎందరో తమ సినిమాలు ట్రెండ్ సెట్టర్స్ అంటూ చెబుతుంటారు. కానీ, ఒక్క సినిమా ఏదో ట్రెండ్ సృష్టించగానే పరవశించిపోయే వారెందరినో చూస్తూంటాం. అయితే పలు ట్రెండ్స్ కు తెలుగునాట ఆద్యునిగా నిలచిన యన్టీఆర్ జైత్రయాత్రను తలచుకుంటే ప్రతి తెలుగు హృదయం పులకించి పోవలసిందే.
జానపదనాయకుడంటే నందమూరే!

ఈ రోజున మనమంతా మాట్లాడుకుంటున్న 'హీరోయిజం' అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచిన తొలి చిత్రం 'పాతాళభైరవి' అనే చెప్పాలి. తెలుగునాటనే కాకుండా యావద్భారతంలోనే ఇదో ట్రెండ్ సెట్టర్ అని తీరాలి. ఆ సినిమాకు ముందు ఎన్నో జానపద తెలుగు చిత్రాలు వెలుగు చూసినప్పటికీ, ఏ చిత్రంలోనూ కథానాయకుణ్ణి అంత సాహసవంతునిగా చిత్రీకరించింది లేదు. పైగా ధీరోదాత్తపాత్రలో తోటరాముని సృష్టించి, ఆ తరువాత అందరూ ఆ మార్గంలో నడిచేలా చేసిన చిత్రం 'పాతాళభైరవి'. దర్శకుడు కేవీరెడ్డి సృజనకు అనువుగా 'పాతాళభైరవి'లో తోటరాముడు పాత్రకు జీవం పోసిన ఘనత నందమూరి తారకరామునిదే. అలా జానపద కథానాయకుడంటే యన్టీఆరే అనేలా నిలచిపోయారు. ఆ పైన ప్రపంచంలోనే అత్యధిక జానపద చిత్రాల్లో నటించిన ఘనతనూ యన్టీఆర్ సొంతం చేసుకున్నారు. యన్టీఆర్ రాకతో అంతకు ముందు 90 శాతం జానపద చిత్రాలతోనే హీరోగా పేరొందిన ఏయన్నార్, ఆ తరువాత జానపద చిత్రాలలో అంతగా నటించడానికే వెనుకంజ వేశారంటే, జానపద కథానాయకునిగా యన్టీఆర్ జనం మదిలో వేసిన ముద్ర ఏలాంటిదో అర్థమవుతుంది. జానపదాల్లోనూ పలు వైవిధ్యమైన గాథలకు తెరతీసిందీ యన్టీఆర్ ఫోక్లోర్ మూవీసే. మాయలు మంత్రాలు లేకుండా జ్ఞాతివైరంతో సాగే రాజకీయానికి యన్టీఆర్ 'జయసింహ' ఆ నాడే బీజం వేసింది. ఇక జానపదాల్లోనూ సస్పెన్స్ ను క్రియేట్ చేసిన ఘనత యన్టీఆర్ 'కంచుకోట'ది. రాబిన్ హుడ్ తరహా జానపదానికి తెలుగునాట యన్టీఆర్ 'జయం మనదే' నాంది పలికింది.

మరపురాని చరిత్ర ... ఇక తెలుగు చిత్రసీమ వెలుగులు విరజిమ్మిందే పౌరాణికాలతో. అయితే యన్టీఆర్ సినిమా రంగంలోకి అడుగుపెట్టే సమయానికి పౌరాణికాల హవా సన్నగిల్లింది. సాంఘిక చిత్రాలు మెల్లగా ఊపందుకోసాగాయి. ఈ సమయంలో మళ్ళీ పౌరాణికాలకు ఓ వెలుగు తీసుకు వచ్చిన ఘనత కూడా నందమూరి సొంతమే. యన్టీఆర్ 'మాయాబజార్'లో శ్రీకృష్ణుని పాత్ర పోషించారు. ఆ సినిమాతోనే యన్టీఆర్ పౌరాణిక ప్రభ ప్రారంభమయింది. ఆ చిత్రం పౌరాణిక కల్పనాగాథలకు ఓ పేటెంట్ రైట్ గా నిలచింది. ఇక దాదాపు పాతికచిత్రాల్లో ఒకే శ్రీకృష్ణ పాత్రను పోషించీ ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ఇక ప్రపంచంలోనే అత్యధిక పౌరాణికాల్లో నటించిన రికార్డ్ సైతం యన్టీఆర్ సొంతమని చెప్పవలసిన పనిలేదు. పురాణగాథల్లోని ప్రతినాయక పాత్రలకు సైతం విశేషాదరణ కలిగేలా చేసిన ఘనత కూడా నందమూరిదే. ఆయన రావణబ్రహ్మగా నటించిన 'సీతారామకళ్యాణం'ను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఇక 'శ్రీక్రిష్ణ పాండవీయం'లో నాయక, ప్రతినాయక పాత్రలయిన శ్రీకృష్ణ, సుయోధనునిగా నటించి, ఆ చిత్రానికి దర్శకత్వం కూడా నెరపి ఒక చరిత్ర సృష్టించిందీ ఆయనే. ఆ తరువాత అదే తీరున 'దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాటపర్వము' చిత్రాల్లోనూ బహుపాత్రలు వేసి మెప్పించిన ఘనతా ఆయన సొంతమే. ఇలా పౌరాణికాల్లోనూ ఎన్నో విలక్షణమైన పాత్రలకు సలక్షణ రూపమిచ్చిన నటసార్వభౌముని నటనావైభవాన్ని ఏ తెలుగువాడు మరచిపోగలడు? ఇక పౌరాణికాల్లోనే కాదు యావద్భారతంలోనే అత్యధిక ప్రదర్శనా కాలం (నాలుగు గంటలకు పైగా) కలిగిన ఏకైక చిత్రంగా 'దానవీరశూరకర్ణ' నిలచింది. ఈ చిత్రానికి కర్త,కర్మ, క్రియ అన్నీ యన్టీఆరే అని వేరే చెప్పక్కర్లేదు.

ఇక చారిత్రక చిత్రాల్లోనూ తారకరాముని నటనావైభవాన్ని ఎవరూ మరచిపోలేరు. శ్రీకృష్ణదేవరాయలు, సమ్రాట్ అశోక, చంద్రగుప్త, వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి పాత్రలలో ఆయన జీవించారు. వీటిలోనూ ఏ మాత్రం గ్లామర్ పాత్ర కాని సంఘసంస్కర్త, తత్వవేత్త అయిన వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్ర పోషించిన 'శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' ఆ రోజుల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలవడం విశేషం. పైగా ఇందులో కమర్షియల్ ఫార్మాట్ కు దూరంగా కేవలం తత్వాలు బోధిస్తూ వినోదం, శృంగారం, పోరాటాలు వంటివేవీ లేకుండా సాగే కథానాయక పాత్రతో కమర్షియల్ గా బిగ్ హిట్ సాధించడం ఇండియాలోనే ఒక్క యన్టీఆర్ కే చెల్లింది. ఈ చిత్రంలో యన్టీఆర్ ఈ నాటికీ ఈ స్థాయిలో విజయం సాధించిన చారిత్రక చిత్రం మరొకటి కానరాదు.

సాంఘికాల్లో...

సాంఘిక చిత్రాల్లోనూ యన్టీఆర్ సినిమాలు పలువురికి మార్గదర్శకంగా నిలిచాయి. పల్లెసీమల్లోని కథ,కథనంతో అంతకు ముందు ఎన్నో చిత్రాలు తెలుగునాట వెలుగు చూసినా, అతిసహజత్వం ఉట్టిపడేలా రూపొందిన చిత్రం 'షావుకారు'. ఆ తరువాత ఆ తరహా పల్లె కథలతో ఎన్నెన్నో తెరకెక్కాయి. సున్నితహాస్యం మాటున ఘాటయిన సమస్యను చర్చించిన చిత్రం 'పెళ్లిచేసి చూడు'. ఈ సినిమా తరువాత అదే పంథాలో ఎన్నో సినిమాలు పయనించాయి. ఓ టాప్ హీరో, అందునా అందాలనటుడు అందవికారిగా నటించి మెప్పించడం కూడా నటుడికి కత్తిమీదసామే. అలాంటి సాములను 'రాజు-పేద, కలసివుంటే కలదు సుఖం' వంటి చిత్రాల్లో చేసి అలరించారు. ఇక బంధాలు అనుబంధాలతో రూపొందిన పలు సాంఘిక చిత్రాలకూ యన్టీఆర్ సినిమాలు ట్రెండ్ సెట్టర్స్ అని చెప్పవచ్చు. అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి 'రక్తసంబంధం' ఈ నాటికీ ఓ రోల్ మోడల్. హీరోహీరోయిన్లంటే కేవలం ప్రేయసీ ప్రియులే / భార్యాభర్తలు కాకుండా అన్నాచెల్లెళ్ళ కూడా నాయకానాయికలుగా రాణించగలరని నిరూపించిన తొలిచిత్రమిదే. అనాథ కథలకు తెలుగునాట ట్రెండ్ సెట్టర్ యన్టీఆర్ 'ఆత్మబంధువు' అని చెప్పక తప్పదు. కాగా, బాధ్యతలు లేకుండా తిరిగే ఓ కుటుంబంలోని చిన్నకొడుకు పరిస్థితులకు పరివర్తన చెంది, చివరకు కుటుంబగౌరవాన్ని నిలపడంలో ప్రధాన పాత్ర పోషించే కథలకు 'ఉమ్మడి కుటుంబం' ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలచింది. అంతెందుకు ద్విపాత్రాభినయ చిత్రాలు అంతకుముందు ఎన్ని వచ్చినా, యన్టీఆర్ 'రాముడు-భీముడు' వచ్చాకే డ్యుయల్ రోల్ మూవీస్ కు ఓ స్పెషల్ క్రేజ్ లభించిందంటే ఆ సినిమా ఎంతటి ట్రెండ్ సెట్టరో ఊహించవచ్చు. ఆ సినిమా సృష్టించిన ట్రెండ్ తో అదే కథ పలు భాషల్లో రీమేక్ అవ్వడాన్ని మరవరాదు.

తెలుగునాట పలు జానర్స్ కూ తెరలేపింది యన్టీఆర్ సినిమాలే. తెలుగు చిత్రసీమలో తొలి సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ ఆయన హీరోగా తెరకెక్కిన 'దొరికితే దొంగలు'. ఇక మొదటి సస్పెన్స్ థ్రిల్లర్ యన్టీఆర్ 'లక్షాధికారి'. ఇక సోషియో మిథికల్ ఫాంటసీకి నాంది పలికింది యన్టీఆర్ 'దేవాంతకుడు'. ఇదే తరహా చిత్రం 'యమగోల'లోనూ మళ్ళీ ఆయనే నటించి అలరించారు. ఆ తరువాత ఆ తరహా కథలతో ఎన్నో సినిమాలు రూపొంది జనాన్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నేడు ఎన్నో చోట్ల మనకు కనిపించే అవకాశవాదులను చూసి 'గిరీశం' లాంటి వాడు అంటూ ఉంటాం. అలాంటి గిరీశం పాత్రను 'కన్యాశుల్కం'లో పోషించి మెప్పించిందీ యన్టీఆరే. ఆ తరువాత హీరోలు సైతం అలాంటి పాత్రలు పోషించడానికి సాహసించారు. ఇక 'పెద్దమనుషులు, పదండిముందుకు' వంటి కొన్ని చిత్రాల్లో రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ, పొలిటికల్ టచ్ లో హీరోయిజం చూపించిన మొదటి సినిమాగా తెలుగునాట 'కథానాయకుడు' నిలచింది. ఈ చిత్రాన్ని తమిళంలో ఎమ్జీఆర్ హీరోగా 'నమ్ నాడ్' తెరకెక్కించగా, ఆయన రాజకీయ జీవితానికి ఆ సినిమాయే అండగా నిలవడం గమనార్హం.

ఇక తెలుగునాట హిందీ రీమేక్ మూవీస్ కు ఓ స్పెషల్ క్రేజ్ తీసుకు వచ్చిందీ యన్టీఆరే. తన 52వ యేట యన్టీఆర్ 'నిప్పులాంటి మనిషి' రీమేక్ లో నటించగా అది రజోత్సవవాలు చేసుకుని, పోలీస్ కేరెక్టర్ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ట్రెండ్ సెట్టర్ గా నిలచింది. 'నిప్పులాంటి మనిషి'కి అమితాబ్ బచ్చన్ 'జంజీర్' మాతృక. ఆ చిత్రంలో నటించే సమయానికి అమితాబ్ వయసు 32ఏళ్ళు. యాంగ్రీ యంగ్ మేన్ గా అమితాబ్ కు ఆ చిత్రం మంచిపేరు సంపాదించి పెట్టింది. యన్టీఆర్ 52 ఏళ్ళ వయసులో అదే పాత్రతో తెలుగువారిని ఆకట్టుకున్నారు. అదే 52 ఏళ్ళ వయసు వచ్చేసరికి అమితాబ్ కేరెక్టర్ రోల్స్ కు పరిమితమవ్వడం గమనార్హం.

యన్టీఆర్ నటించిన 'అడవిరాముడు' చిత్రం ఆ రోజుల్లో దక్షిణాదిన హయ్యెస్ట్ గ్రాసర్ గానిలచి, అందరినీ అబ్బురపరచింది. ఆ సినిమా ఫార్ములాతోనే ఈ నాటికీ పలు చిత్రాలు తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. యన్టీఆర్ 'వేటగాడు' క్యాస్టూమ్స్ కు ఓ ట్రెండ్ సెట్టర్ అయింది. ఈ సినిమా తరువాత 'యాక్స్' టైలర్ బ్రాండ్ కోసం క్యూలో నిలచి తమ దుస్తులు కుట్టించుకున్నవారెందరో! అరవై ఏళ్ళ వ్యక్తి టీనేజ్ యూత్ కు దుస్తుల్లో రోల్ మోడల్ గా నిలవడం ప్రపంచంలో ఒక్క యన్టీఆర్ విషయంలోనే జరిగింది. ఇక 'సర్దార్ పాపారాయుడు'లో యన్టీఆర్ తండ్రీకొడుకులుగా నటించి విజయం సాధించారు. తండ్రి మెయిన్ రోల్ కాగా, తనయుడు కుర్రోడిగా, పాటలతో అలరిస్తూ సాగిందీ చిత్రం. అదే ఫార్ములాతో యన్టీఆర్ "కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి" కూడా తెరకెక్కి ఘనవిజయం సాధించాయి. ఆ తరువాత ఎందరో హీరోలు ఇదే పంథాలో పయనించిన సంగతి మరువరాదు.

ఆ నాడు కోటి రూపాయలు అంటే ఈ రోజుల్లో దాదాపు 200 కోట్లకు పైమాటే. అలాంటి అత్యధిక చిత్రాలు యన్టీఆర్ సొంతం. ఆ రోజుల్లో పరిశ్రమ మొత్తానికి పన్నెండు కోటిరూపాయల చిత్రాలు ఉండగా, అందులో పది చిత్రాలు ఆయనవే కావడం విశేషం. ఆయన చిత్రసీమలో ఉన్నంతవరకూ ఆయనే రారాజు. పదేళ్ళ గ్యాప్ తరువాత 70 ఏళ్ల వయసులోనూ 'మేజర్ చంద్రకాంత్'లో టైటిల్ రోల్ పోషిస్తూ ఘనవిజయం సాధించడం ఆయనకే సొంతం. తాను పరిశ్రమలో ప్రవేశించే నాటికి తెలుగు సినిమా ఏడాదికి పది చిత్రాలతో సాగుతోంది. అలాంటిది యన్టీఆర్ సినిమా రంగం వదలివెళ్ళే నాటికి సంవత్సరానికి వంద చిత్రాలు రూపొందే స్థాయికి పరిశ్రమ చేరింది. ఈ అభివృద్ధిలో యన్టీఆర్ దే ప్రధాన పాత్ర అని అందరూ అంగీకరించే అంశమే. ఇలాంటి ఎన్నెన్నో అరుదైన అంశాలు యన్టీఆర్ నటనావైభవంలో మనకు దర్శనమిస్తాయి.

రాజకీయాల్లోనూ...

ఈ రోజున పలువురు సినిమా తారలు రాజకీయాల్లో రాణించాలని తపిస్తున్నారు. అందులోనూ ఆయనే ట్రెండ్ సెట్టర్. యన్టీఆర్ కంటే ముందు కొందరు సినిమా నటులు రాజకీయాల్లో రాణించినా, ఆయన ఆగమనంతోనే సినిమా తారలకు రాజకీయాలలో విలువ పెరగడం అందరికీ తెలుసు. అంటే ఇక్కడా ఆయనే ట్రెండ్ సెట్టర్. తనను ఆదరించిన ప్రజలకోసం ఓ పక్కా ప్రణాళికతో అరుదెంచారు రామారావు. చైతన్యరథంపై ఆయన సాగించిన యాత్ర తరువాత రాజకీయాల్లో దేశవ్యాప్తంగా అందరూ అనుకరించేలా చేసింది. ఇక ఆయన ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలు ఈ నాటికీ పేరుమార్పులతో అమలవుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వరుసగా మూడు సంవత్సరాలు (1983, 1984, 1985) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఘనత కూడా యన్టీఆర్ సొంతమే. ఇక సమైక్యాంధ్రప్రదేశ్ లో నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నదీ ఆయనే. ప్రాంతీయ పార్టీలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం తీసుకు వచ్చిన ఘనతా ఆయనదే. 1984లో దేశం యావత్తు కాంగ్రెస్ హవా వీచగా, తెలుగునాట ఆయన పార్టీ గాలివీచింది. పార్లమెంట్ లో ఓ ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించడం దేశచరిత్రలో ఆ ఒక్కసారే జరిగింది. ఆ తరువాత ఆయన నేతృత్వంలోనే 'నేషనల్ ఫ్రంట్' ఆవిర్భావం. సంకీర్ణ ప్రభుత్వాలకు 1989లో కేంద్రంలో బీజం వేసి, దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయాలకు దారి చూపిన ఘనతా ఆయన నేషనల్ ఫ్రంట్ దే. ఇలా జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన ప్రాంతీయ పార్టీ సారథిగా ఆయన నిలిచారు. మళ్ళీ ఇన్నాళ్ళకు దేశంలో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల హవా వీచే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రోజుల్లో యన్టీఆర్ సాగిన తీరును ప్రతి రాజకీయ నాయకుడు పఠిస్తూ ఉండడం విశేషం.

ఇలా చెప్పుకుంటూ పోతే యన్టీఆర్ రాజకీయ జీవితంలోనూ ఎన్నెన్నో రాజకీయ, పరిపాలాన సంస్కరణలు, మైలురాళ్ళు. స్థలాభావంతో కొన్నిటినే మననం చేసుకున్నాం. ఏది ఏమైనా తాను కాలిడిన ప్రతిరంగంలోనూ అరుదైన చారిత్రాత్మక ట్రెండ్స్ను సృష్టించిన ఈ కారణజన్ముని ఎవరు మరచిపోగలరు?
- కొమ్మినేని వెంకటేశ్వర రావు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment