CM Revanth Reddy:జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన ఆస్తులు మనవే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..

  • IndiaGlitz, [Thursday,May 16 2024]

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎవరికి వారే తమదే ధీమా అని వ్యక్తం చేస్తున్నారు. అయితే అలా పోలింగ్ ముగిసిందో లేదో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పదేళ్లుగా తెలంగాణ, ఏపీ మధ్య కొనసాగుతున్న విభజన అంశాలు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల కేటాయింపు తదితర అంశాలపై నివేదిక తయారుచేయాలని అధికారలను ఆదేశించారు. జూన్ 2వ తేదీతో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేవలం తెలంగాణ రాజధానిగా మారనుంది. దీంతో హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలని రేవంత్ ఆదేశించారు.

ఈ మేరకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు.. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్తు సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలు పూర్తి చేయాలని ఆదేశించారు.

తొలుత రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని.. అలాగే సమస్యలు ఉన్న అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. జూన్ 2 తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుండనుండటంతో ఈ పదేళ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. పునర్విభజన చట్ట ప్రకారం పెండింగ్ లో ఉన్న అంశాలు, ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని

మరోవైపు సీఎం రేవంత్ క్యాంపు కార్యాలయం కూడా మార్చనున్నారు. ఇప్పటివరకు జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ సమావేశాలకు ఇబ్బందిగా మారడంతో కార్యాలయం మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏపీకి కేటాయించిన లేక్‌ వ్యూ గెస్ట్ హౌస్ తెలంగాణ ఆధీనంలోకి రానున్న నేపథ్యంలో దానిని క్యాంపు కార్యాలయంగా ఏర్పాటుచేసుకోవాలని భావిస్తున్నారు. జూన్ 2 తర్వాత సీఎం క్యాంపు కార్యాలయం మార్చనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ నెల 18వ తేదీన రాష్ట్ర కేబినేట్ సమావేశం ఏర్పాటు చేయాలని రేవంత్ నిర్ణయించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు. వీటితో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు.