MLC Elections: తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం.. గెలుపుపై పార్టీల ధీమా..
Send us your feedback to audioarticles@vaarta.com
పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా కూడా తెలంగాణలో మాత్రం ఎన్నికల హడావిడి ఇంకా తగ్గలేదు. మే 27(సోమవారం) జరగనున్న ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగిసింది. ప్రచారం చివరి రోజు కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు. దీంతో పేరుకు ఎమ్మెల్సీ ఉపఎన్నిక అయినా అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ప్రచారం, ప్రలోభాలు సాగుతున్నట్టు తెలుస్తోంది.
ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పల్లా రాజీనామాతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేష్‌రెడ్డి బరిలో ఉన్నారు. తమ సిట్టింగ్ స్థానమైన ఈ స్థానాన్ని దక్కించుకునందుకు బీఆర్ఎస్ శాయశక్తుల పోరాడుతోంది.
మరోవైపు ఈ స్థానాన్ని కైవసం చేసుకుని పట్టభద్రుల్లో కూడా తమకే పట్టు ఉందని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. అలాగే ఈ సీటు దక్కించుకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెక్ పెట్టవచ్చనే ఆలోచనలో బీజేపీ ఉంది. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడగడంతోపాటు ఆత్మీయ సమ్మేళనాలు, ఇతర పేర్లతో విద్యావంతులకు చేరువ అయ్యేందుకు శ్రమించారు. తీన్మార్ మల్లన్న తరఫున సీఎం రేవంత్ రెడ్డి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం చేశారు.
ఇక బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున కేటీఆర్, హరీష్‌రావు సుడిగాలి పర్యటనలు చేసి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విద్యావంతులకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి తరఫున రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్ సహా కీలకమైన నేతలంతా ప్రచారం నిర్వహించారు. ఇలా మూడు పార్టీల ప్రచారంతో ఎమ్మెల్సీ ఉపఎన్నిక కూడా ఉత్కంఠంగా మారింది. మరి ఈ స్థానం ఏ పార్టీ దక్కించుకుంటుందో జూన్ 2 వరకు వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments