Producer Abhishek Agarwal:నిర్మాతలను గౌరవించేది ఇలాగేనా.. ఫిల్మ్ ఫేర్ నిర్వాహకులపై ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ఆగ్రహం
- IndiaGlitz, [Thursday,April 27 2023]
68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలు వివాదాస్పదమవుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కగా.. దానిని అందుకోవడానికి ఈ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి నిరాకరించారు. మొత్తం ఏడు విభాగాల్లో ది కాశ్మీర్ ఫైల్స్ నామినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా అలకబూనారు. తనను ఫిల్మ్ ఫేర్ వేడుకలకు ఆహ్వానించకపోవడం అన్యాయమన్నారు.
స్టార్స్‌ని తయారు చేసేది నిర్మాతే:
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. నిర్మాత అనేవాడు స్టార్స్‌ను తయారు చేస్తారని అన్నారు. కానీ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ మాత్రం నిర్మాతలను గుర్తించడంలో విఫలమవుతోందని అభిషేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచానికి కాశ్మీర్‌లో ఏం జరిగిందో చెప్పాలనే ఉద్దేశంతోనే ‘ది కాశ్మీర్ ఫైల్స్’ను నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో 7 విభాగాలకు నామినేట్ అయ్యిందని అభిషేక్ అగర్వాల్ తెలిపారు. అలాంటి తనను అవార్డ్‌ల వేడుకకు ఆహ్వానించలేదని ఆయన ఫైర్ అయ్యారు. నిజంగా నిర్మాతలను గుర్తించేది ఇలాంటి సమయంలోనే అని అభిషేక్ అన్నారు. గౌరవం, గుర్తింపు వాటి వల్లే గొప్ప కథలు ముందుకు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు తన ట్వీట్‌ను ఫిల్మ్ ఫేర్‌కు, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి ట్యాగ్ చేశారు.
ఇప్పటికే అవార్డులకు దూరంగా వివేక్ అగ్నిహోత్రి :
అంతకుముందు వివేక్ అగ్నిహోత్రి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్‌కు రావడానికి నిరాకరిస్తూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అణచివేత, అవినీతి వ్యవస్థలో భాగం కావాలనుకోవడం.. రచయితలు, దర్శకులు, చిత్ర బృందంలోని ఇతర సిబ్బందిని తక్కువ స్థాయిలో చిత్రించే ఈ అవార్డులలో భాగం కాకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీనితో పాటు హిందీకి సమాంతరంగా మరో చిత్ర పరిశ్రమ ఎదుగుదల గురించి కూడా వివేక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే చివరిలో ఫిల్మ్ ఫేర్ అవార్డులకు ఎంపికైన వారికి వివేక్ అగ్నిహోత్రి అభినందనలు తెలిపి ముగించారు.