Vivek Agnihotri:మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపిన ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్.. ఎందుకంటే..?
- IndiaGlitz, [Tuesday,May 09 2023]
టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపారు ‘‘ది కశ్మీర్ ఫైల్స్’’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. తన సినిమాపై నిరాధారమైన, తమ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా మమత ప్రకటన చేశారని వివేక్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అందుకే నోటీసులు పంపించినట్లు ఆయన వెల్లడించారు. తనతో పాటు నటి పల్లవి జోషి, నిర్మాత అభిషేక్ అగర్వాల్‌లు కూడా మమతా బెనర్జీకి నోటీసులు పంపారని వివేక్ చెప్పారు. ఈ నోటీసులను ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. మమత , ఆమె ప్రభుత్వ చర్యల కారణంగా తన చిత్ర బృందానికి పరువు నష్టం కలిగిందని.. ఇందుకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని వివేక్ అగ్నిహోత్రి డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే:
కోల్‌కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఒక వర్గాన్ని అవమానించడం కోసమేనని అన్నారు. అలాగే కేరళ స్టోరీ కూడా వక్రీకరించిన కథేనని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బీజేపీ నిధులు పొందుతున్న కొందరు స్టార్లు కొద్దిరోజుల క్రితం బెంగాల్ వచ్చారని.. వక్రీకరించిన, కల్పిత కథలతో వారు బెంగాల్ ఫైల్స్ తెరకెక్కించే పనిలో వున్నారని సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయితే వాస్తవానికి బెంగాల్ వెళ్లింది ఎవరో కాదు.. వివేక్ అగ్నిహోత్రి ఆయన బృందం. ఆయన ప్రస్తుతం ‘ది ఢిల్లీ ఫైల్స్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్‌లో భాగంగానే వివేక్ బెంగాల్ వెళ్లారు. 1946-47, 1971లలో బెంగాల్లో జరిగిన మారణహోమానని ఆయన ఢిల్లీ ఫైల్స్‌లో చూపించబోతున్నారు. ఈ క్రమంలో కోల్‌కతాలో వున్న వివేక్‌పై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు.