కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

  • IndiaGlitz, [Friday,September 04 2020]

తెలంగాణలో కరోనా పరిస్థితులు పరీక్షలు, చికిత్సలపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన నివేదిక అస్పష్టంగా ఉందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాల్లో కరోనా వైద్య సదుపాయాలు పెంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం కరోనా మృతులపై వాస్తవాలు వెల్లడించలేదనిపిస్తోందని హైకోర్టు పేర్కొంది. కేసులు పెరుగుతున్నప్పటికీ మృతుల సంఖ్య మాత్రం 9 లేదా 10 ఉండటం అనుమానంగా ఉందని హైకోర్టు పేర్కొంది.

కరోనా మృతులపై వాస్తవ వివరాలు వెల్లడించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా స్థాయి బులెటిన్ల విడుదలపై ప్రభుత్వం, జిల్లా అధికారులు వేర్వేరుగా నివేదికలు సమర్పిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 31 నుంచి ఈ నెల 4 వరకూ జిల్లా బులిటెన్లు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసిలోని ఐసోలేషన్, కోవిడ్ కేంద్రాల వివరాలు సమర్పించాలని కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల నుంచి కోవిడ్ బాధితులు హైదరాబాద్‌కు వచ్చేలా అంబులెన్సులను పెంచాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసే ప్రభుత్వ ల్యాబ్‌లను పెంచాలని సూచించింది. ఆస్పత్రుల్లో లైవ్ డాష్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీధుల్లో నివసించే వారికి మొబైల్ వ్యాన్ల ద్వారా కరోనా పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రైవేట్ ఆస్పత్రులు చట్టానికి అతీతమా? లేక ప్రత్యేక రక్షణలు ఉన్నాయా? అని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. రాయితీలు తీసుకున్న ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రజలకు సేవ చేసే బాధ్యత లేదా? అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ ఆస్పత్రులపై విచారణ జరపాలని జాతీయ ఫార్మా ధరల సంస్థను హైకోర్టు ఆదేశించింది.