Pravalika Suicide: ప్రవళిక ఆత్మహత్యపై నివేదిక కోరిన గవర్నర్.. ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు
Send us your feedback to audioarticles@vaarta.com
గ్రూప-2 పరీక్షలు వాయిదా పడడంతో హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఉరివేసుకుని ప్రవళిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. నిరుద్యోగులు సహనం కోల్పోవద్దని కోరారు. ఈ ఘటనపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సీఎస్, డీజీపీ, TSPSC కార్యదర్శిని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
ఆత్మహత్యలు వద్దు.. పాలకులను తరిమికొడదాం..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవళిక ఆత్మహత్యపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అమ్మా ప్రవళిక.. ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన దానివి.. మరికొంత ఆత్మస్థైర్యాన్ని కూడదీసుకోలేకపోయావా? అని ఆవేదన చెందారు. నువ్వు కన్న కలల కోసం మరికొన్నాళ్లు వేచి ఉండలేకపోయావా? నిన్ను కన్నవారి కళ్లల్లో ఆనందం చూడాలన్న సంగతిని మరిచిపోయావా? అన్నారు. ఎంతోమందికి దారి చూపాలనుకున్నదానివి.. ఇలా అర్ధాంతరంగా నీ ప్రయాణం ముగిస్తావా? అని వాపోయారు. భగవంతుడు నీ ఆత్మకు శాంతిని చేకూర్చాలని ప్రార్థిస్తూ.. యువతీ, యువకుల్లారా! ఆత్మహత్యలు వద్దు.. మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. మన భవిష్యత్తుతో చెలగాటం ఆడిన ఈ నక్కలు ఎక్కడ నక్కినా గుంజుకొచ్చి దోషులుగా నిలబెడదామని.. వీళ్ళ నక్క జిత్తులను నడి రోడ్డులో నిలబెట్టి తరిమికొడదామని రేవంత్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదు..
అలాగే గ్రూప్-2 పరీక్షలు రద్దు కావడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్ అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నిరుద్యోగులు మానసికంగా కృంగిపోకుండా వారికి నైతిక మద్దతు ఇవ్వడం బీజేపీగా మా బాధ్యతన్నారు. అందులో భాగంగా వారి వద్దకు వెళ్లిన వారిపై లాఠీచార్జ్ తగదని.. ఇంకా కేసీఆర్ కనుసన్నల్లో పనిచేస్తున్నాం అనే భ్రమలో నుండి పోలీసులు బయటికి రావాలని సూచించారు. నిరుద్యోగ యువతీ, యువకుల్లారా ఆత్మహత్య పరిష్కారం కాదని.. కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దు.. మంచి రోజులు వస్తాయని ఈటల కోరారు.
తల్లిదండ్రుల ఉసురు మీకు తగలక మానదు..
అటు తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్యోగాలు లేక ప్రవళిక లాంటి అమ్మాయి ఉరి వేసుకొని బలవన్మరనానికి పాల్పడుతుంటే.. కేసీఆర్‌ను చూసి ఓటెయ్యండని ఎలా అడుగుతున్నారు కేటీఆర్ గారు? అని ప్రశ్నించారు. ఉద్యోగం సాధించి వస్తానమ్మా అని పట్నం వెళ్లిన బిడ్డ విగతజీవిగా వస్తే ఆ తల్లిదండ్రుల గుండె కోత ఎలా ఉంటుందో తెలుసా మీకు? ప్రవల్లికది ఆత్మహత్య కాదు.. మీ సర్కార్ చేసిన హత్య అన్నారు. నష్ట జాతకురాలు ప్రవల్లిక కాదు.. అన్ని అధికారాలున్నా నిరుద్యోగుల కోసం ఏం చేయలేని పాలకులు నష్ట జాతకులని మండిపడ్డారు. గద్దెనెక్కిన నాటి నుంచి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని.. ఉద్యోగం లేక ప్రాణాలు తీసుకుంటున్న చెట్టంత బిడ్డని కోల్పోతున్న ఆ తల్లిదండ్రుల ఉసురు మీకు, మీ ప్రభుత్వానికి తగలక మానదని హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments