FirstPolling:దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న తొలి విడత పోలింగ్
- IndiaGlitz, [Friday,April 19 2024]
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాల్లో 102 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు కూడా ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఈ విడతలో అత్యధికంగా తమిళనాడులోని 39 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. దీంతో సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఇందులో భాగంగా ఉదయమే సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రజినీతో పాటు సినీ ప్రముఖులు అజిత్, శివకార్తికేయన్, ధనుష్, ఖుష్బూ సుందర్, త్రిష, రాధికా శరత్ కుమార్ దంతపతులు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్‌హాసన్ చెన్నైలోని కోయంబెడు నియోజకవర్గంలో తన ఓటు వేశారు.
మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల అంచనాలు అందుకుంటూ కచ్చితంగా ప్రతిపక్ష కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్టాలిన్‌తో పాటు మరికొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఓటు వేశారు. బీజేపీ చీఫ్ అన్నమలై కోయంబత్తూర్‌లో ఓటు వేయగా.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తేని నియోజకవర్గంలో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ కూటమే విజయం సాధిస్తుందని తేల్చి చెప్పారు. ఇక సద్గురు జగ్గీ వాసుదేవ్ ఉదయమే పోలింగ్ బూత్‌కి వచ్చి ఓటు వేశారు.
కాగా తొలిదశ పోలింగ్‌లో భాగంగా మొత్తం ఎనిమిది మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఓ మాజీ గవర్నర్ తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. నాగ్‌పుర్ స్థానం నుంచి కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పోటీ చేస్తున్నారు. అరుణాచల్ వెస్ట్ నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పోటీలో ఉన్నారు. అస్సాంలోని డిబ్రూగఢ్ స్థానం నుంచి కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ బరిలో నిలిచారు. ఇక న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్, ఎల్.మురుగన్ వంటి ప్రముఖులు పోటీలో దిగారు. త్రిపురలోని వెస్ట్ త్రిపుర నియోజకవర్గం నుంచి మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ పోటీలో ఉన్నారు. అలాగే తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి, బీజేపీ తమిళనాడు అధ్యక్షడు అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు.