Congress Candidates:కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. తెలంగాణ అభ్యర్థులు వీరే..
Send us your feedback to audioarticles@vaarta.com
లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 36 మంది అభ్యర్థులకు ఈ జాబితాలో స్థానం కల్పించింది. కేరళ-15, ఛత్తీస్‌గఢ్-6, కర్ణాటక-6, మేఘాలయ-2, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కో ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. ఇక తెలంగాణ నుంచి 17 నియోజకవర్గాలకు గానూ నాలుగు స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది.
జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, చేవెళ్ల నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి, నల్లగొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కందుకూరు రఘువీర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పోటీ చేయనున్నారు. అయితే మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. కానీ ఈ స్థానాన్ని హోల్డ్‌లో పెట్టడం గమనార్హం.
ఇదిలా ఉంటే కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మరోసారి అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో యూపీలోని అమేథీతో పాటు వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేశారు. అమేథీలో ఓడిపోయిన రాహుల్ ఇక్కడి నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అలాగే ఈ జాబితాలో ఛత్తీస్గడ్ మాజీ సీఎం భూపేష్ భగల్‌కు చోటు కల్పించారు. మరోవైపు కర్ణాటకలోని శివమొగ్గ నుంచి కన్నడ స్టార్ హీరో భార్య గీతా శివరాజ్ కుమార్.. బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి డీకే సురేష్ బరిలో దిగనున్నారు.
గురువారం సాయంత్రం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, శశిధరూర్, అంబికా సోనీ, సింగ్ దేవ్‌తో హాజరుకాగా.. న్యాయ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ వర్చువల్‌గా పాల్గొన్నారు. తెలంగాణ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జీ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు హాజరయ్యారు. కాగా ఇప్పటికే బీజేపీ తొలి జాబితాలో 195 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments