Pension:ఒకటో తేదీ వచ్చింది.. పింఛన్ రాలేదు.. బ్యాంకులకు వెళ్లాలా అంటూ ఆగ్రహం..
- IndiaGlitz, [Wednesday,May 01 2024]
తెల్లారింది... ఒకటో తేదీ వచ్చింది... ఎప్పట్లానే కరెన్సీ నోట్లతో గుమ్మం ముందు నవ్వుతూ నిలబడి తాతా.. పెన్షన్ తీసుకో... అవ్వా వేలిముద్ర వేద్దువురా.. పెద్దమ్మా బాగున్నావా.. తాతా బాగున్నావా అని పిలిచే వాలంటీర్ రాలేదు. వాలంటీర్ వచ్చి డబ్బులు చేతికి అందిస్తే మందులు.. పప్పు.. ఉప్పు... సరుకులు కొనుక్కుందాం అనుకున్న అవ్వాతాతలకు తీవ్ర నిరాశ ఎదురైంది. చేతికి డబ్బులు అందకపోవడంతో ఈ మండుంటెండల్లో ఆటో ఛార్జీలు పెట్టుకుని మరి పక్క ఊరులోని బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు తెచ్చుకోవాలి.
దీంతో ఈ మండుటెండల్లో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు.. వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. సంక్షేమం అంటేనే అసహ్యించుకునే చంద్రబాబు వేసిన ఎత్తులు, కుట్రల వల్ల వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం వృద్ధులకు సాధ్యమవుతుందా..? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లలో నిలబడడం..ఆ ఫారాలు నింపడం.. ఇదంతా వారికి పెద్ద సమస్యగా మారనుంది. అంతేకాకుండా కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్) లేకపోతే కొంత పెనాల్టీ ఛార్జీలు విధిస్తాయి.
చాలా మంది వృద్ధలుకు మినిమమ్ బ్యాలెన్స్ అంటేనే తెలియదు. వారికి బ్యాంక్ అకౌంట్ ఉన్నా అందులో కనీస నగదు ఉంచాలని తెలియకపోవడంతో ఆ అకౌంట్ ఖాళీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ నిబంధనల ప్రకారం ఎక్కువ రోజులు కనీస నగదు లేకపోతే అకౌంట్‌లో డబ్బులు పడిన వెంటనే కొంత మొత్తం పెనాల్టీ రూపంలో వసూలు చేస్తారు. దీంతో వచ్చే రూ.3వేల పింఛన్‌లో 500 రూపాయలు దాకా కోత పడితే తమ పరిస్థితి ఏంటని లబోదిబోమంటున్నారు. హాయిగా ఇంటికే వాలంటీర్లు వచ్చి తమ చేతికి డబ్బులు ఇవ్వడాన్ని ఓర్వలేని చంద్రబాబు బ్యాచ్ ఇలా తమను నానా కష్టాలు పెడుతున్నారని ఫైర్ అవుతున్నారు.
బాబు అండ్ కో కుట్రల వల్ల ఇంటి వద్దనే పెన్షన్ తీసుకునే అవకాశం కోల్పోయిన వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబుకు చేయడం చేతకాదు.. చేస్తున్న జగన్ సర్కార్ చేతులను ఈసీ నిబంధనలతో కట్టేశారని మండిపడుతున్నారు. అసలు చంద్రబాబుకు మనసు లేదు... వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు అని శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే చంద్రబాబు పాలన మళ్లీ వస్తే రాష్ట్రం మొత్తం అస్తవ్యస్థం అవుతుందని.. ఈసారి ఎన్నికల్లో తమ ఓటుతో మరోసారి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.