ఫ్యామిలీ మ్యాన్ 2 (వెబ్ సిరీస్) రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
2019లో విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తొలి సీజన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. రాజ్ అండ్ డీకే దర్శత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. రెండవ సీజన్ కోసం ప్రేక్షుకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మనోజ్ బాజ్ పాయ్, సమంత, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తొలి సారి వెబ్ సిరీస్ లో నటిస్తుండడం, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సీజన్ 2పై అంచనాలు పెరిగిపోయాయి. నేడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఫ్యామిలిమ్యాన్ 2 అంచనాలని అందుకుందా లేదా అనేది సమీక్షలో చూద్దాం.
కథ:
శ్రీకాంత్ తివారి (మనోజ్ బాజ్ పాయ్) తన కుటుంబంతో ఉంటూ ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అతడి భార్య సుచిత్ర (ప్రియమణి). గతంలో శ్రీకాంత్ టాస్క్ లో ఏజెంట్ గా ఉంటాడు. కానీ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ తన ఉద్యోగానికి శ్రీకాంత్ రాజీనామా చేస్తాడు. కుటుంబం కోసం ఐటి కంపెనీలో చేరుతాడు.
శ్రీకాంత్, సుచిత్ర దంపతుల మధ్య కొన్ని సమస్యలు ఉంటాయి. ఇదే సమయంలో ఇండియా, శ్రీలంక మధ్య రాజకీయ ఒప్పందాలు జరుగుతుంటాయి. శ్రీలంక లోని తమిళ రెబల్స్ ని మట్టుబెట్టడంలో ఆ దేశానికి ఇండియా సాయం చేస్తుంది. ఇదిలా ఉండగా రెబల్స్ నాయకుడు భాస్కరన్ (మిమే గోపి) ఇండియాపై ఓ భారీ కుట్ర పన్నుతాడు. దీనికోసం రాజ్యలక్ష్మి(సమంత)ని రంగంలోకి దించుతాడు.
అటు ఫ్యామిలీ, ప్రొఫెషన్ గా సతమతమవుతున్న శ్రీకాంత్ తన స్నేహితుడు జెకె ద్వారా తప్పనిసరిగా టాస్క్ లోకి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఇండియాపై తమిళ రెబెల్స్ చేసిన కుట్ర ఏంటి ? రెబల్స్ మిషన్ లో రాజ్యలక్ష్మి రోల్ ఏంటి ? శ్రీకాంత్ వారిని అడ్డుకోగలిగాడా ? శ్రీకాంత్ కి, తన టీమ్ కి ఎదురైన సవాళ్లు ఏంటి ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
దేశం భద్రతా విషయంలో చిక్కుల్లో ఉన్నప్పుడు కథయకుడు తన ఇన్వెస్టిగేషన్ తో చిన్న చిన్న లీడ్స్ సాధించి కుట్రని ఛేదిస్తాడు. జేమ్స్ బాండ్, మిలటరీ ఆపరేషన్స్, టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో ఉన్న కథలన్నీ ఇలాగే ఉంటాయి. కానీ కథనంలో ప్రేక్షకులని ఎలా కట్టిపడేశారు.. ఎలాంటి థ్రిల్ అందించారు అనేది కీలకం.
ఈ విషయంలో ఫ్యామిలీ మ్యాన్ 2 యూనిట్ అదరగొట్టేసింది అని చెప్పాలి. రెండు మూడు ఎపిసోడ్స్ నెమ్మదిగా అనిపిస్తాయి. ఉద్యోగం మానేసి ఉన్న హీరో ఫ్యామిలీ సమస్యలని ఎలా డీల్ చేస్తున్నాడు అని డీటెయిల్ గా చెప్పే ప్రయత్నం చేశారు. అందువల్లే ఆ సన్నివేశాలు స్లో అనిపిస్తాయి. ఇక శ్రీకాంత్ చేస్తున్న ఐటి జాబ్ సీన్స్ ఫన్నీగా ఉంటాయి.
శ్రీకాంత్ తిరిగి టాస్క్ లో చేరాక కథ ఆసక్తికరంగా మారుతుంది. ప్రతి ఎపిసోడ్ చివర ఉత్కంఠ కలిగించే సీన్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. సెకండ్ ఎపిసోడ్ లో సమంత పాత్రని పరిచయం చేస్తారు. చిన్న చిన్న సన్నివేశాలతో ఆమె పాత్రపై ఉత్కంఠ పెంచుతూ వచ్చారు.
అనితర సాధ్యమైన రెబల్ మహిళగా ఉన్న సమంతకు, దేశం కోసం ఎంతకైనా తెగించే శ్రీకాంత్ టీమ్ కి మధ్య సన్నివేశాలు సీట్ ఎడ్జ్ మీద కూర్చో బెడతాయి. ఇక కథ అయిపోయింది అని అనుకున్న ప్రతిసారి సర్ ప్రైజ్ చేస్తూనే వచ్చారు.
క్లైమాక్స్ లో రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో లాగే హీరో చిక్కులో పడతాడు. కానీ ఆ సన్నివేశాల చిత్రీకరణ, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. కథ ఎండింగ్ హీరోయిక్ గా ఉంటుంది. ప్రేక్షకులకు పూర్తి సంతృప్తి ఇస్తుంది.
నటీనటులు:
భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా, ఏజెంట్ గా మనోజ్ బాజ్ పాయ్ నటన విశ్వరూపం ప్రదర్శించినట్లుగా ఉంటుంది. అన్ని వేరియషన్స్ ని ఆయన అద్భుతంగా క్యారీ చేశారు. ఇందులో కామెడీ చాలా తక్కువ. ఆ బాధ్యతని కూడా మనోజ్ తీసుకున్నారు. మనోజ్ చెప్పే వన్ వర్డ్ డైలాగులు బావుంటాయి. యాక్షన్ సీన్స్ లో రియలిస్టిగ్ గా చేశారు.
ఇక సమంత మరోసారి తన పెర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేసింది. సమంత తొలి సీన్ నుంచి చివరి వరకు సీరియస్ మూడ్ నే కొనసాగిస్తోంది. ఒకే తరహా మూడ్ అయినప్పటికీ ఆ పాత్రకు అది అవసరం. తీవ్రమైన వేదన,ప్రతీకార వాంఛ ఆమె మనసులో ఉంటాయి. శ్రీకాంత్ అండ్ టీంకు ఆమె కొరకరాని కొయ్యగా మారి చేసే యాక్షన్ సీన్స్ చాలా బావుంటాయి.
ఇక ప్రియమణి పాత్రలో సింపుల్ ఎమోషన్స్ ఉంటాయి. చివర్లో ఓ ఎమోషనల్ సీన్ లో ప్రియమణి ఆకట్టుకుంది. ఇక ప్రధాని పాత్రని ఆ స్థాయి హంగులతో చూపించలేదు.
సాంకేతికంగా:
నేపథ్య సంగీతం, సినిమాట్రోగ్రఫీ హైలెవల్ లో ఉందని చెప్పాలి. దర్శకులు రాజ్ డీకే ద్వయం ప్రేక్షకులని కథలో ఇన్వాల్వ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. సచిన్ జిగర్, కేతన్ నేపథ్య సంగీతం కథకు బలాన్ని చేకూర్చడమే కాదు.. తదుపరి సీన్ పై ఉత్కంఠ పెంచేలా ఉంటుంది.
మొదటి మూడు నాలుగు ఎపిసోడ్స్ లో ఎడిటింగ్ లోపించింది అనిపించే సీన్స్ చాలానే ఉంటాయి. యాక్షన్ ఎపిసోడ్స్ రిచ్ గా ఉంటూనే, సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. సహజత్వం కోసం దర్శకులు సినిమాటిక్ లిబర్టీని పక్కన పెట్టారనే అనిపిస్తుంది.
తొలి సీజన్ ని మరిపించేలా ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నాయి. రాజ్ అండ్ డీకే ఇద్దరూ అద్భుతమైన పనితనమే కనబరిచారు.
ఫైనల్ పంచ్:
బలమైన కథ, కథనాలు, ఎమోషన్స్, డ్రామా, సాలిడ్ యాక్షన్స్ ఎపిసోడ్స్ లాంటి పాజిటివ్ అంశాలతో ఫ్యామిలీ మ్యాన్ 2 అంచనాలకు తగ్గట్లుగా ఉంది. దేశం కోసం ఏమైనా చేసే ఏజెంట్ గా మనోజ్ బాజ్ పాయ్.. ఎంతకైనా తెగించే రెబల్ గా సమంత పాత్రలు ఫ్యామిలీ మ్యాన్ 2లో మేజర్ హైలైట్స్. వెంటనే ఫ్యామిలీ మ్యాన్ 2 చూడండి. తప్పకుండా థ్రిల్ అవుతారు.
రేటింగ్: 3/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments