'ఫ్యామిలీ మ్యాన్'కి బీజం అలా పడిందా.. మహేష్ బాబుతో నిజమేనా?
- IndiaGlitz, [Tuesday,June 08 2021]
రాజ్ అండ్ డీకే.. ఇండియాలో వెబ్ సిరీస్ ల అభిమానులని ఊపేస్తున్న ద్వయం వీరు. తెలుగువారై ఉండి బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. రాజ్ అండ్ డీకే లకు ఈ స్టార్ డమ్ ఓవర్ నైట్ లో రాలేదు. రాజ్ నిడిమోరు (రాజ్) తిరుపతికి చెందిన వ్యక్తి. కృష్ణ దాసరి కొత్తపల్లి (డీకే) చిత్తూరు వాసి.
శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ లో విద్యనభ్యసించడం ద్వారా వీరిద్దరూ స్నేహితులయ్యారు. ఇప్పుడు విడదీయరాని ప్రాణ మిత్రులుగా మారిపోయారు. అమెరికాలో ఉద్యోగం వదిలేసి సినిమాపై మక్కువతో ముంబయిలో అడుగుపెట్టారు. ఆరునెలలపాటు అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎంతో కష్టంతో అవకాశాలు దక్కించుకుని ప్లేవర్స్, 99, పి ఎండింగ్ లాంటి చిత్రాలతో బాలీవుడ్ లో సత్తా చాటారు.
స్పై థ్రిల్లర్ చిత్రాలపై మక్కువతో 'ఎ జెంటిల్ మ్యాన్' అనే మూవీ తెరకెక్కించారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇలాంటి కథలని రెండుగంటల సినిమాగా చేస్తే ఫలితం ఉండదని, భావోద్వేగాలు చూపించలేమని వారికి అర్థం అయింది. అప్పుడే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్ కు బీజం పడింది. దాని ఫలితం అందరికి తెలిసిందే.
బాలీవుడ్ లో ఎంతటి సక్సెస్ సాధించినప్పటికీ తెలుగుని మాత్రం మరచిపోలేదు. డి ఫర్ దోపిడీ, సినిమా బండి లాంటి చిత్రాలని రాజ్ అండ్ డీకే ఇక్కడ నిర్మించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయని వినికిడి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. మహేష్ , రాజ్ అండ్ డీకే కాంబో సెట్ ఐతే మాత్రం అభిమానులకు పండగే. మహేష్ ని జేమ్స్ బాండ్ తరహా పాత్రలో చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.