Train Accident:ప్రాణాలకు తెగించి మరీ.. ఘోర రైలు ప్రమాదం ఆపిన వృద్ధ దంపతులు..
Send us your feedback to audioarticles@vaarta.com
అర్థరాత్రి పూట రైల్వే ట్రాక్‌పై ఓ లారీ బోల్తాపడింది. అటు వైపు నుంచి వేగంగా రైలు దూసుకొస్తుంది. చిమ్మచీకట్లు.. చుట్టూ ఎవరూ లేరు.. దీంతో ఆ లారీని రైలు ఢీకొడితే పెను ప్రమాదం ఖాయం. అయితే ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన ఓ వృద్ధ జంట మాత్రం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వందలాది మంది ప్రాణాలు కాపాడారు. కేరళ నుంచి తమిళనాడులోని తూత్తుకూడికి ప్లైవుడ్ లోడుతో వెళ్తోన్న లారీ.. తెన్‌కాశీ వద్ద ఎస్.వేలవు ప్రాంతంలో అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై బోల్తా పడింది. అదే సమయంలో తిరునెల్వేలి- పాలక్కడ్ ఎక్స్‌ప్రెస్ రైలు అటుగా వస్తోంది.
ట్రక్ బోల్తా పడినప్పుడు పెద్ద శబ్దం రావడంతో సమీపంలో నివసించే వృద్ధ దంపతులు షణ్ముగయ్య- కురుంథమ్మాళ్ దీనిని గమనించారు. ఆ రైలును ఎలాగైనా ఆపాలని భావించి పరుగెత్తుకుంటూ ట్రాక్ పైకి వచ్చారు. తమ చేతిలో ఉన్న టార్చిలైటు ఊపుతూ లోకోపైలట్‌కు సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్ బ్రేకులు వేయడంతో రైలు ఆగింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. అయితే ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా ధ్వంసం కాగా.. డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మృతిచెందిన డ్రైవర్‌ను ముక్కుదాల్ ప్రాంతానికి చెందిన మణికందన్(34)గా గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు స్థానికుల సహాయంతో లారీని తొలగించి ట్రాక్‌ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను దారి మళ్లించగా.. మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. మరమ్మత్తు పనులు పూర్తయిన అనంతరం రైళ్లు యధావిథిగా నడిచేందుకు అనుమతించారు. ప్రాణాలకు తెగించి మరీ పెను ప్రమాదాన్ని తప్పించిన షణ్ముగయ్య- కురుంథమ్మాళ్ దంపతులపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. వారే కానీ లేకుంటే వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని.. ఇలాంటి వారి వల్లే ఇంకా మానవత్వం బతికి ఉందని కొనియాడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout