YS Jagan: సీఎం జగన్ చొరవతో నెరవేరనున్న దశాబ్దాల కల
Send us your feedback to audioarticles@vaarta.com
కొందరు నాయకులు ప్రజలకు మంచి జరిగే పనులు మొదలుపెట్టారంటే.. పూర్తిచేసే దాకా విశ్రమించరు. అలాంటి పట్టువదలని నాయకుడిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనులను కూడా చేపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఈ క్రమంలో కరువు పీడిత పల్నాడు ప్రాంతం ప్రజల దశాబ్దాల కల నెరవేర్చబోతున్నారు. కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైన వరికపూడిసెల ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేయబోతున్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మించే ప్రదేశం టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా సీఎం జగన్ కేంద్రంతో దశల వారీగా చర్చలు జరిపి అనుమతులు పొందారు. దీంతో వరికపూడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తొలిదశ ఎత్తిపోతల పనులను రూ. 340.26 కోట్లతో చేపట్టేందుకు పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం జగన్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశ పనులను వేగంగా పూర్తి చేసి.. అధునాతన పైప్ ఇరిగేషన్ ద్వారా 24,900 ఎకరాలకు నీళ్లు అందించనున్నారు.
వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 40 కి.మీ.ల ఎగువన కృష్ణా నదిలో వరికపూడిసెల వాగు కలవక ముందే.. ఆ వాగు నుంచి జలాలను ఎత్తిపోసి పల్నాడు భూములకు ఇవ్వాలన్నది ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన. అయితే ఈ పనులు టైగర్ రిజర్వ్ ఫారెస్టులో చేపట్టడానికి కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ప్రతిపాదన అక్కడితో ఆగిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి మళ్ళీ కదలిక వచ్చింది. దాంతో గోదావరి-కృష్ణ పెన్నా అనుసంధానం తొలి దశ పనులతోపాటు వరికపూడిసెల ఎత్తిపోతల తొలి దశ పనులను అధికారులు చేపట్టారు.
వరికపూడిసెల వాగు కుడి గట్టున ఎత్తిపోతలను నిర్మించి తొలి దశలో రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున 1.57 టీఎంసీలను తరలించి వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.340.26 కోట్లతో చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 4 కి.మీ.ల పొడవున పైప్ లైన్ నిర్మాణానికి 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపారు. 70 ఏళ్ల క్రితమే ప్రాజెక్టును ప్రతిపాదించి ఆయా ప్రభుత్వాలు శంకుస్థాపన చేసినా అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్టు కాగితాల్లోనే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ ఫారెస్ట్ భూమికి ప్రతిగా దుర్గి మండలంలో 21 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు బదలాయించి పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించింది. దాంతో వరికపూడిసెల ఎత్తిపోతలకు ఏప్రిల్ 28న అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.
ఈ ఎత్తిపోతల ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగులకుంట, లోయపల్లి గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సరఫరా చేయడానికి వీలుగా పైప్ లైన్లు వేయనున్నారు. పైపులైన్ల ద్వారా నీటిని తరలించడం వల్ల సరఫరా నష్టాలు ఉండవని ఆయకట్టుకు సమర్ధవంతంగా నీటిని అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాచర్లలో పర్యటించి వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. మొత్తానికి దశాబ్దాల ప్రజల కల సాకారానికి సీఎం జగన్ పూనుకోవడంతో ఆ ప్రాంత ప్రజల తాగు, సాగు నీరు కష్టాలు తీరనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com