Gokul Chat:'గోకుల్‌ చాట్' అధినేత కన్నుమూత.. కోఠిలో విషాదఛాయలు.

  • IndiaGlitz, [Friday,December 22 2023]

హైదరాబాద్‌లోని 'గోకుల్‌ చాట్' గురించి తెలియని వారుండరూ అంటే అతిశయోక్తి కాదు. దేశంలోని ప్రఖ్యాతిగాంచింది. గోకుల్‌ చాట్‌ వ్యవస్థాపకుడు ముకుంద్‌దాస్‌ విజయ్‌వర్గీయ(75) కన్నుమూశారు. వయో సంబంధ సమస్యల కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాచిగూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స గురువారం ఉదయం పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కోఠి, సుల్తాన్‌బజార్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

పలువురు రాజకీయ ప్రముఖలు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఇమ్లిబన్‌ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. 1966లో కోఠిలో ‘గోకుల్‌ చాట్‌’ పేరిట చాట్‌ భండార్‌ ఏర్పాటుచేశారు. రుచి, శుచితో చాట్‌ ప్రియుల ఆదరణ పొంది అంచెంచెలుగా ఎదిగి దేశవ్యాప్తంగా పేరు దక్కించుకుంది.

కాగా 2007 ఆగస్టు 25వ తేదీన కోఠిలోని గోకుల్ చాట్‌తో పాటు లుంబినీ పార్క్‌లోనూ ఉగ్రవాదులు బాంబు దాడులు జరిపారు. ఈ నరమేధంలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. గోకుల్ చాట్ దుకాణం వద్ద జరిగిన పేలుడులో 33 మంది మరణించగా.. లుంబినీ పార్కులో జరిగిన పేలుడులో 9 మంది మరణించారు. వంలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులకు పాల్పడిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు ఇటీవల శిక్ష పడింది. హైదరాబాద్‌కు చెందిన ఒబేదుర్ రహ్మన్‌తో పాటు, ధనీష్ అన్సారీ, అఫ్తాబ్ అలాం, ఇమ్రాన్ ఖాన్‌లకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎన్‌ఐఏ(NIA) కోర్టు తీర్పు వెల్లడించింది.