Nominations Withdraw: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు.. బరిలో ఎంతమంది ఉన్నారంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో కీలమైన నామినేషన్ల ప్రక్రియకు నేటితో తెరపడింది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు.. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరించారు. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కాగా.. ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు స్వీకరించారు. అనంతరం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగ్గా.. తాజాగా నామినేషన్ల విత్ డ్రా గడువు కూడా పూర్తైంది.
దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులపై ఓ స్పష్టత వచ్చింది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 4,210 నామినేషన్లు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కొంతమంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ పూర్తికావడంతో తెలుగుదేశం పార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద తప్పలేదు. ఉండి, విజయనగరం నియోజకవర్గాలలో ఆ పార్టీ రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెంకట శివరామరాజు రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజుకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత రఘురామకృష్ణరాజుకు అవకాశం ఇచ్చారు. అయితే ఈ టికెట్ ఆశించిన భంగపడిన శివరామరాజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుఫున నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. ఇక విజయనగరం అసెంబ్లీ టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత.. రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక్కడి నుంచి టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు బరిలో ఉన్నారు.
అయితే నూజివీడు, మాడుగుల, మడకశిరలో మాత్రం టీడీపీకి ఊరట దక్కింది. నూజివీడు నుంచి టీడీపీ రెబల్ నామినేషన్ వేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అలాగే మాడుగుల రెబల్ అభ్యర్థి పైలా ప్రసాద్, మడకశిర రెబల్ అభ్యర్థి సునీల్ కుమార్ సైతం తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
ఇటు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు మొత్తం 893 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో 268 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మరికొంత మంది పార్టీల బుజ్జగింపులతో నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు 625 మంది బరిలో నిలిచారు. ఇక అత్యధికంగా మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి 77 నామినేషన్లు దాఖలు కాగా.. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి అత్యల్పంగా 12 నామినేషన్లు వచ్చాయి. కాగా మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com