Election Campaign End:రేపటితో ముగియనున్న ప్రచారం.. నేతల సుడిగాలి పర్యటనలు..

  • IndiaGlitz, [Monday,November 27 2023]

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. కేవలం 48 గంటలు మాత్రమే ప్రచారానికి మిగిలింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు మైక్‌లు బంద్ కానున్నాయి. దీంతో అన్ని పార్టీల నేతలు దూకుడు పెంచారు. బహిరంగసభలు, రోడ్‌షోలతో పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. ఓవైపు ఇంటింటి ప్రచారం, మరోవైపు గ్రామ గ్రామానికి, వార్డులకు, కాలనీలకు తిరుగుతూ సభలు, రోడ్‌షోలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత నెలరోజులుగా చేసిన ప్రచారం ఓ ఎత్తయితే.. ఈ రెండు రోజులు మరో ఎత్తు అనిపించేలా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఇక బీజేపీ తరపున ప్రధాని మోదీ, అమిత్‌ షా, నడ్డా, పవన్ కల్యాణ్‌ వంటి నేతలు ప్రచారం నిర్వహించనుండగా.. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి వంటి నేతలు జోరుగా క్యాంపెన్ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

ప్రచారంలో భాగంగా మహబూబాబాద్, కరీంనగర్‌లో ఇవాళ ప్రధాని మోదీ బహిరంసభల్లో పాల్గొని ప్రసగించనున్నారు. అనంతరం హైదరాబాద్‌లో పలు చోట్ల రోడ్‌షో నిర్వహిస్తారు. హుజురాబాద్‌, పెద్దపల్లి, మంచిర్యాలలో అమిత్‌షా.. జగిత్యాల, బోధన్‌, బాన్సువాడ, జుక్కల్‌లో జేపీ నడ్డా ప్రచారం చేస్తారు. దేవరకద్ర, మంథని, పరకాలలో అసోం సీఎం బిశ్వశర్మ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. హనుమకొండలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మేధావులతో సమావేశం కానున్నారు.

అటు భువనగిరి, గద్వాల, కొడంగల్‌లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనుండగా.. ఇల్లందు, డోర్నకల్‌, కొడంగల్‌లో ఇవాళ రేవంత్‌ రెడ్డి బహిరంగసభల్లో పాల్గొంటారు. నర్సాపూర్‌లో పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రచారం నిర్వహిస్తారు. ఇతర నియోకజకవర్గాలత్లో మిగిలిన కీలక నేతలు కూడా క్యాంపెయిన్ చేయనున్నారు.

బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్.. షాద్‌నగర్‌, చేవెళ్ల, ఆందోల్‌, సంగారెడ్డిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. సుల్తానాబాద్‌, వెల్గటూర్‌, చెన్నూర్‌, హైదరాబాద్‌లో కేటీఆర్‌ రోడ్‌షోలతోపాటు.. హుజురాబాద్‌, ఏటూరునాగారం, అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌లో ‌ ప్రచారం చేస్తారు. మొత్తానికి ఓట్లు రాబట్టుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా ప్రధాన పార్టీల నేతలు వదులుకోవడం లేదు.