110 మంది రైతుల దారుణ హత్య.. పొలాల్లో గుట్టలుగా శవాలు
- IndiaGlitz, [Monday,November 30 2020]
పొలం పనులకు వెళ్లిన 110 మంది వ్యవసాయ కూలీలను అమానుషంగా హతమార్చిన ఘటన ఈశాన్య నైజీరియాలోని మైదుగురి నగరానికి సమీపంలో కోషోబ్ అనే గ్రామంలో చోటు చేసుకుంది. బోకో హరమ్ సంస్థకు చెందిన మిలిటెంట్లు పొలాల్లో పని చేస్తున్న రైతులపై దాడి చేశారు. కొందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. మరొకంత మంది రైతులను కాళ్లూ చేతులూ కట్టేసి గొంతు కోసి కిరాతకంగా హతమార్చారు. దీంతో పొలాలన్నీ రక్తంతో నిండిపోయాయి. పొలాలు శవాల గుట్టలుగా మారిపోయాయి. ఈ ఘటనతో నైజీరియా ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
చనిపోయిన వారందరికీ నైజీరియా ప్రభుత్వం సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించింది. కాగా.. అదే రోజున పొలం పనులకు వెళ్లిన చాలా మంది రైతులు కనిపించకుండా పోయినట్టు సమాచారం. వీరిలో 10 మంది దాకా మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు ముహ్మద్ బుహారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘బోకో హరమ్’ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారని నైజీరియాలో ఐక్యరాజ్య సమితి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఎడ్వర్డ్ కల్లోన్ తెలిపారు. ఈ ఏడాది పౌరులపై జరిగిన మారణకాండలో ఇదే అతి భయానకమని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనపై బోర్నో రాష్ట్ర గవర్నర్ బాబాగానా జులం స్పందించారు. ప్రజల రక్షణ కోసం మరింత మంది సైనికులను అదనంగా నియమించాలని నైజీరియాలోని సమాఖ్య ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రాష్ట్ర ప్రజల రక్షణ కోసం సివిలియన్ జాయింట్ టాస్క్ ఫోర్స్ సభ్యులు, సివిల్ డిఫెన్స్ ఫైటర్స్ మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నారు. తమ రాష్ట్రంలో ప్రజలు ఒక పక్క కరువుతో, ఆకలితో అలమటిస్తూ చనిపోతున్నారని, మరోపక్క పొలం పనులకు వెళ్లి పంటలు జీవితాన్ని నెట్టుకొస్తున్న రైతన్నలు ఇలా ప్రాణాలు కోల్పోతున్నారని బాబాగానా జులం ఆవేదన వ్యక్తం చేశారు.