YS Sharmila:అందుకే ఏపీ రాజకీయాల్లోకి వచ్చాను.. కంటతడి పెట్టిన వైయస్ షర్మిల..
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదని.. అలాంటిది తల్లి లాంటి ఏపీని జగనన్న వెన్నుపోటు పొడిచారని ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల విమర్శించారు. మంగళగిరిలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతో తాను రాజకీయాల్లోకి రాలేదని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ మాటతోనే రాజకీయాల్లోకి వచ్చానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె కంటతడి పెట్టుకున్నారు. హోదా మన బిడ్డల హక్కు.. దీన్ని ఎంతమంది పట్టించుకున్నారు? హోదా వచ్చి ఉంటే రాజధాని, పోలవరం మనం కట్టుకోలేమా? పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఎందుకు తక్కువగా ఉండాలి? అని ప్రశ్నించారు.
ప్రజలు గొర్రెలు లెక్క కాదు.. సింహాల లెక్క బతకాలని అంబేద్కర్ చెప్పారని.. ఎవరైన గొర్రెలను బలి ఇస్తారు కానీ.. సింహాలను బలి ఇవ్వరని గుర్తుచేశారు. హోదా విషయంలో ప్రజలు 10 ఏళ్లు గొర్రెలు అయ్యారని.. అందుకే బలి ఇచ్చారని షర్మిల మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి 5 ఏళ్లు చంద్రబాబు, తర్వాత 5 ఏళ్లు జగన్ గొర్రెలను చేశారని విరుచుకుపడ్డారు. అందుకే సింహాల లెక్క ఉద్యమం చేయకుంటే ప్రత్యేక హోదా ఎప్పటికి రాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని నిర్ణయించుకుందని వెల్లడించారు.
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్నది కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. ఉద్యమం ఉవ్వెత్తున జరగకపోతే మనకు హోదా రాదన్నారు. ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అని నినదించారు. పోరాడితే పోయేది ఏమి లేదు.. వెధవ బానిస సంకెళ్లు తప్పా.. అన్నారు. ఇన్నాళ్లు మనం మంచితనంగా ఉన్నది చాలు.. మంచితనం ఉంటే మనకు హోదా ఇచ్చారా? మంచితనంగా ఉంటే పోలవరం కట్టారా? అని ఆమె ప్రశ్నించారు. ఆంధ్రులను మోసం చేసిన ప్రధాని మోదీ ఒక డి ఫాల్టర్, కేడీ అని ఘాటు విమర్శలు చేశారు.
హోదా వచ్చి ఉంటే ఏపీ అభివృద్ధి ఎక్కడో ఉండేదని.. 15 లక్షల కోట్ల రూపాయలు వచ్చేవన్నారు. చంద్రబాబుకి రాష్ట్ర అభివృద్ధి ఇష్టం లేదని.. తన తండ్రి రక్తం పంచుకు పుట్టిన జగనన్నకి సైతం అభివృద్ధి ధ్యాస లేదని విమర్శలు చేశారు. మాట ఇచ్చి మడత పెట్టిన ఘనత జగన్‌ది అని తెలిపారు. జలయజ్ఞం కింద YSR కట్టిన ప్రాజెక్టులకి దిక్కులేదని.. ఇదేనా వారసత్వం అంటే.. ఇదేనా రాజన్న బిడ్డ అంటే అని ప్రశ్నించారు. హోదా లేకపోతే రాష్ట్ర అభివృద్ధి లేదు.. హోదా రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు.. మన రాష్ట్రానికి భవిష్యత్ లేదు.. ప్రత్యేక హోదా మనకు ఊపిరి లాంటిది అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com