ఏపీలో ఆ పార్టీదే విజయం.. జాతీయ మీడియా సర్వే ఏం చెప్పిందంటే..?

  • IndiaGlitz, [Friday,February 09 2024]

దేశంలో త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించనున్నారు. ముచ్చటగా బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందా..? ఇండియా కూటమి పవర్‌ చేపడుతుందా..? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా సంస్థలు ప్రజా నాడిని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా 'ఇండియా టుడే' సంస్థ 'మూడ్ ఆఫ్ ది నేషన్'(India Today-C Voter Mood of the Nation Survey)పేరిట సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చింది. అలాగే ఆంధ్రపద్రేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని కూడా తేల్చింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటివరకు ఉన్న లెక్కలన్నీ తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోందని తెలిపింది. మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ 17 స్థానాల్లో జయకేతనం ఎగరవేస్తుందని తెలిపింది. ఇక అధికార వైసీపీ కేవలం 8 స్థానాలకే పరిమితం కానుందని పేర్కొంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఖాతా కూడా తెరవని వెల్లడించింది.

2019 ఎన్నికల్లోఅ వైసీపీకి 22 ఎంపీ స్థానాలు రాగా ప్రస్తుతం 14 స్థానాలు కోల్పోయి 8 స్థానాలకు పరిమితమవుతుందని తెలిపింది. అదే టీడీపీ 3 ఎంపీ స్థానాల నుంచి 17 స్థానాలకు ఎగబాకుతుందని చెప్పింది. ఓట్ల శాతం పరంగా చూస్తే టీడీపీకి 45 శాతం, వైసీపీకి 41.1 శాతం, బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్‌కు 2.7శాతం, మిగతా పార్టీలకు 9శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. అయితే టీడీపీ-జనసేన కూటమిగా కాకుండా విడివిడిగా సర్వే చేశారు.

ఒంటరిగా పోటీ చేసినా టీడీపీకి 17 స్థానాలు వస్తాయని చెప్పడం గమనార్హం. ఇక టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తే సీట్లతో పాటు ఓట్ల శాతం పెరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఈ సర్వే రిపోర్టును సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 10 ఎంపీ సీట్లు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెరో 3 సీట్లు, ఎంఐఎం పార్టీకి ఓ సీటు వస్తాయని వెల్లడించింది.

మరోవైపు రెండు రోజుల క్రితం విడుదలైన టైమ్స్ నౌ-మ్యాట్రిజ్ సర్వేలో అధికార వైసీపీకి ఎక్కువ సీట్లు రావడం విశేషం. 25 ఎంపీ సీట్లలో వైసీపీ 19 సీట్లు, టీడీపీ-జనసేన 6 సీట్లు దక్కించుకుంటాయని సర్వేలో తేలింది. సీఎంగా జగన్ పనితీరు పట్ల 38 శాతం సానుకూలత వ్యక్తం చేయగా.. 26 శాతం మంది పరవాలేదన్నారు. 34 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఏ సర్వేను నమ్మాలో..? నమ్మకూడదో..? ప్రజలు తేల్చుకోలేకపోతున్నారు. ఎవరకు ఎన్ని సీట్లు వస్తాయో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడక తప్పదు.

More News

Lokesh :ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల 'శంఖారావం'కి లోకేష్ సిద్ధం

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మరోసారి ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల యువగళం పాదయాత్రను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే.

Yatra 2:తెలుగు రాష్ట్రాల్లో 'యాత్ర-2' ప్రభంజనం.. దద్దరిల్లుతోన్న థియేటర్లు..

ఏపీ సీఎం జగన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన 'యాత్ర-2' మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది.

Kodikatthi Srinu :ఎట్టకేలకు కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు

2019 ఎన్నికలకు ముందు ఏపీలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది.

Governor:తమది ప్రజా ప్రభుత్వం.. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.

Chandrababu:అమిత్‌ షాతో చంద్రబాబు భేటీ.. ఎన్డీఏలోకి ఆహ్వానం..

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరూ పొత్తులో కలుస్తారో అర్థం కాని పరిస్థితి.