Thalapathy Vijay:రాజకీయాల్లోకి దళపతి విజయ్.. కొత్త పార్టీ ప్రకటన..
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. తాను రాజకీయాల్లోకి వస్తు్న్నట్లు ఆయన అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అలాగే 'తమిళగ వెట్రి కజగం' పేరుతో కొత్త పార్టీని కూడా ప్రకటించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. తమిళ ప్రజలు కోరుకునే మౌలికమైన రాజకీయ మార్పునకు నాయకత్వం వహిస్తానని స్పష్టంచేశారు. విజయ్ కొత్త పార్టీ ప్రకటన తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది.
కాగా కొద్ది రోజుల నుంచి విజయ్.. కొత్త పార్టీ పెట్టనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల డిసెంబర్లో భారీ వరదలు వచ్చినప్పుడు బాధిత కుటుంబాలను విజయ్ స్వయంగా వెళ్లి కలిశారు. అంతేకాకుండా వారికి ఆర్థిక సాయాన్ని కూడా అందించారు. అలాగే మెరిట్ స్టూడెంట్స్‌కి స్కాలర్షిప్ ఇవ్వడం వంటి చేశారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమని అభిమానులు భావించారు. ఇప్పుడు వారి అంచనాలను నిజం చేస్తూ పార్టీ ప్రకటించారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కచ్చితంగా తమ హీరోను సీఎం చేసి తీరుతామని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే తమిళనాడు రాజకీయాలతో తొలి నుంచి సినీ ఇండస్ట్రీకి సంబంధం ఉంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజ నేతలు చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం ఏకంగా ముఖ్యమంత్రులు అయి ఏళ్ల పాటు పాలించారు. అయితే వారి మరణం తర్వాత ఇప్పటివరకు ఏ సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి కాలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఓ దశలో ఆయన కూడా సొంతంగా పార్టీ పెట్టాలని భావించారు. అయితే ఏమైందో ఏమో తాను రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఇక లోకనాయకుడు కమల్ హాసన్ పార్టీ పెట్టినా అక్కడి రాజకీయాల్లో తనదైన ముద్ర వేయలేకపోయారు. 2021లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. అప్పటి నుంచి ఏ స్టార్ హీరో మళ్లీ తమిళ రాజకీయాల్లో బలమైన ముద్ర వేస్తారనే చర్చ మొదలైంది. ఇందుకు సమాధానంగా దళపతి విజయ్ పేరు తెరపైకి వచ్చింది. అందరూ అనుకున్నట్లే రజినీకాంత్ తర్వాత తమిళనాట అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్.. ఇన్నేళ్లకు రాజకీయ అరంగేట్రం చేశారు.
ఇప్పటికే ఆయన అభిమానులు 'విజయ్ మక్కల్ ఇయక్కమ్' పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 2022లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 'మక్కల్ ఇయక్కమ్' తరపున అభ్యర్థులు 169 స్థానాల్లో పోటీ చేస్తే 121 స్థానాల్లో విజయం సాధించారు. కమల్ హసన్ పార్టీ 'మక్కల్ నీదిమయ్యం', సీమాన్ నేతృత్వంలోని 'నామ్ తమిలర్ కట్చి' కనీసం ఈ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. దీంతో పూర్తిగా రాజకీయాల్లోకి రాకముందే ఇంత భారీ స్థాయిలో సీట్లు సాధించడంతో విజయ్ పేరు మార్మోగింది. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో తమిళ రాజకీయాల్లో ఎలాంటి చరిత్ర సృష్టిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout