Thalapathy Vijay: రాజకీయాల్లోకి దళపతి విజయ్.. త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన..!
- IndiaGlitz, [Saturday,January 27 2024]
సినిమాలకు రాజకీయాలకు దగ్గరి సంబంధం ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీలో సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చారు. అందులో కొంతమంది సక్సెస్ అయితే మరికొందరు ఫెయిల్ అయ్యారు. ఇక తమిళనాడులో అయితే సినిమా నటులకు, రాజకీయాలకు ఎనలేని అనుబంధం ఉంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ నుంచి కరుణానిధి, ఎం.జి రామచంద్రన్, జయలలిత, విజయ్ కాంత్, కమల్ హాసన్, టి.రాజేందర్, రాధా రవి, కారుణాస్, గౌతమి, సీమాన్, శరత్ కుమార్, కుష్బూ లాంటి వారు రాజకీయాల్లోకి వచ్చాయి. అయితే ఇందులో సక్సెస్ అయిందంటే ముగ్గురే అని చెప్పాలి. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత మాత్రమే ముఖ్యమంత్రులు అయి తమిళనాడును ఏళ్ల పాటు పాలించారు.
అయితే వారి మరణం తర్వాత ఇప్పటివరకు ఏ నటుడు ముఖ్యమంత్రి కాలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఓ దశలో ఆయన కూడా సొంతంగా పార్టీ పెట్టాలని భావించారు. అయితే ఏమైందో ఏమో తాను రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ పార్టీ పెట్టినా అక్కడి రాజకీయాల్లో తనదైన ముద్ర వేయలేకపోయారు. 2021లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. అప్పటి నుంచి ఏ స్టార్ హీరో మళ్లీ తమిళ రాజకీయాల్లో బలమైన ముద్ర వేస్తారనే చర్చ మొదలైంది.
ఇందుకు సమాధానంగా దళపతి విజయ్ పేరు తెరపైకి వచ్చింది. రజినీకాంత్ తర్వాత తమిళనాట మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్.. రాజకీయ అరంగేట్రానికి సిద్ధమయ్యారని.. సొంత పార్టీ ఏర్పాటుకు కూడా సన్నద్ధం అయ్యారని సమాచారం. ఇప్పటికే ఆయన అభిమానులు 'విజయ్ మక్కల్ ఇయక్కమ్' పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటుంది. 2022లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 'మక్కల్ ఇయక్కమ్' తరపున అభ్యర్థులు 169 స్థానాల్లో పోటీ చేస్తే 121 స్థానాల్లో విజయం సాధించారు. కమల్ హసన్ పార్టీ 'మక్కల్ నీదిమయ్యం', సీమాన్ నేతృత్వంలోని 'నామ్ తమిలర్ కట్చి' కనీసం ఈ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. దీంతో పూర్తిగా రాజకీయాల్లోకి రాకముందే ఇంత భారీ స్థాయిలో సీట్లు సాధించడంతో విజయ్ పేరు మార్మోగింది.
ఇటీవల డిసెంబర్లో భారీ వరదలు వచ్చినప్పుడు బాధిత కుటుంబాలను విజయ్ స్వయంగా వెళ్లి కలిశాడు. అంతేకాకుండా వారికి ఆర్థిక సాయాన్ని కూడా అందించాడు. ఈ నేపథ్యంలోనే అధికారికంగా విజయ్ పార్టీ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. తాజాగా విజయ్ అభిమానులు చెన్నైలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చెన్నై, కోవై, తిరుచ్చి, మధురైతో పాటు అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. 'విజయ్ మక్కల్ ఇయక్కం' పేరిట కొత్త పార్టీ రిజిస్ట్రర్ చేయాలని వారికి విజయ్ సూచించినట్లు సమాచారం. ఈ మేరకు ఫిబ్రవరి 4న ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల రోజుల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేయాలని తన ప్రతినిధులకు చెప్పినట్లు తమిళ మీడియా చెబుతోంది. త్వరలోనే లోక్సభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో గ్రాండ్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు విజయ్ భావిస్తున్నట్లు పేర్కొంటుంది. మొత్తానికి మార్చిలో కొత్త పార్టీ ప్రకటన ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.