రసవత్తరంగా తమిళ రాజకీయం.. క్షణ క్షణం టెన్షన్ టెన్షన్..

  • IndiaGlitz, [Sunday,October 04 2020]

తమిళ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఈ నెల 7న అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణ సమయంలో నెలకొన్న ఆసక్తికర పరిణామాలన్నీ తిరిగి పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు పన్నీర్ సెల్వం.. మరోవైపు పళనిస్వామి.. ఇటు శశికళ.. అటు కేంద్రం.. నలువైపులా ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. పరిస్థితి ఏ నిమిషం ఎలా మారుతుందో అర్థం కాకుండా ఉంది. సీఎం అభ్యర్థిగా ఎవరి పేరును ప్రకటిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

పళనికి అనుకూలంగా కొంగుమండలం..

పన్నీర్ సెల్వం పేరును ప్రకటిస్తారా? లేదంటే పళని స్వామి పేరును ప్రకటిస్తారా? ఒకవేళ పళని స్వామి పేరును ప్రకటిస్తే.. పన్నీర్ సెల్వం గతంలో మాదిరిగా మరోసారి అమ్మ సాక్షిగా మౌనపోరాటానికి దిగుతారా? అనేవే అర్థం కాకుండా ఉంటే.. మరోవైపు జైలు నుంచి శశికళ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె విడుదలైతే పార్టీని హసత్గతం చేసుకుంటారా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహరమంతా ఇలా నడుస్తుంటే కేంద్రం కూడా ఏమీ తక్కువ తినలేదన్నట్టుగా తమిళనాడు విషయంలో అడుగులు వేస్తోంది. ఈ పరిణామాలన్నీ ఎటు వైపునకు దారితీస్తాయోనని అన్నాడీఎంకే శ్రేణఉల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ హయాం నుంచి కొంగుమండలం అని పిలవబడే కోయంబత్తూరు, ఈరోడ్‌, తిరుప్పూరు, కరూరు, సేలం, దిండుగల్‌, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలు పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్నాయి. ఈ కొంగుమండలం ముఖ్యమంత్రి పళనిస్వామికి పూర్తి మద్దతునిస్తోంది. ఈ కొంగు మండలానికి చెందిన ఇద్దరు మంత్రులు పళనిస్వామియే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

పన్నీర్‌సెల్వంకు కేంద్రం మద్దతు..

దక్షిణాది జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సొంత జిల్లా తేని తప్ప మిగిలిన జిల్లాల్లో ప్రస్తుతం అన్నాడీఎంకేకు వ్యతిరేకత ఉంది. ఈ జిల్లాల్లో అభివృద్ధి పెద్దగా లేకపోవడం.. కరోనా సమయంలో ఏవిధంగానూ ఆదుకోకపోవడంతో పళనిస్వామిపై ప్రజానీకం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇక్కడి ప్రజలు డీఎంకేకు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పన్నీర్ సెల్వంకి పెద్దగా వ్యతిరేకత అంటూ ఏమీ లేదు. పన్నీర్‌సెల్వంకు పార్టీ నేతల నుంచి గట్టి మద్దతు లభిస్తున్నప్పటికీ అది ఆయనకు అండగా ఉండాల్సిన సమయంలో లభించదని తెలుస్తోంది. గతంలో కూడా ఆయనకు ఇలాగే జరిగిన విషయం తెలిసిందే. అయితే పన్నీర్ సెల్వంకు కేంద్రం మద్దతు ఉంది. ఇది తన ప్లస్‌గా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

దినకరన్ ఎంట్రీ..

ఇదిలా ఉంటే ఒక్కసారిగా మక్కల్‌ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్‌ ఉన్నట్టుండి సీన్‌లోకి ఎంటర్ అయ్యారు. అసలే ట్రయాంగిల్ వార్ నడుస్తుంటే మధ్యలో బీజేపీ ఎంటర్ అయ్యింది. దినకరన్.. బీజేపీ పెద్దలతో అనూహ్యంగా చర్చలు జరపడం వంటి అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దినకరన్‌తో బీజేపీ చర్చల వెనుక శశికళ అన్నాడీఎంకేలో తిరిగి కీ రోల్ పోషించుకునేందుకేనని ఒక చర్చ.. అన్నాడీఎంకేలో అమ్మామక్కల్ మున్నేట్ర కళగం విలీనం చేసేందుకేనని మరొక చర్చ నడుస్తోంది. కాగా.. శశికళ జైలు నుంచి విడుదలైతే మాత్రం ట్రయాంగిల్ వార్ బీభత్సమవుతుందని.. అన్నాడీఎంకేలో భారీ మార్పులుంటాయని కార్యకర్తలు భావిస్తున్నారు. ఏదిఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో పన్నీర్ సెల్వం, పళనిస్వామిల ఐక్యతే పార్టీని నిలకడగా ఉంచగలదని తెలుస్తోంది. ఈనెల 7న సీఎం అభ్యర్థి పేరును అధిష్టానం ప్రకటించనుంది. ఆ తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.