ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చిన రైతుల మెగా మార్చ్‌ను పోలీసులు అడ్డుకుంటున్నారు. పంజాబ్, హరియాణా మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్దకు వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరోవైపు జాతీయ రహదారి మీద వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంటు వరకు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టేందుకు రైతులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల వెంబడి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రహదారి పొడవునా పోలీసులను మొహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. రహదారులపై కాంక్రీట్ బ్లాక్స్, ఇనుప కంచెలు, మేకులను అడ్డుగా పెట్టారు. నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. ముందు జాగ్రత్తగా పార్లమెంట్ సమీపంలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు.
అటు రైతులు ఆందోళనను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. నిరసన చేపట్టిన రైతులను నిర్బంధించేందుకు వీలుగా ఢిల్లీలోని బావనా ప్రాంతంలో తాత్కాలిక జైలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే కేంద్రం చర్యలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. అన్నదాతలను జైల్లో పెట్టడం సరికాదని తెలిపారు. మొత్తానికి రైతుల ఆందోళనతో దేశ రాజధాని అట్టుడుకుతోంది.
కాగా డిమాండ్లపై కేంద్రం, రైతుల మధ్య సోమవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కనీస ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని రైతు నాయకులు చేసిన డిమాండ్‌పై ఏకాభిప్రాయం కుదరలేదు. దీనిపై రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చర్చల విషయంలో చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఛలో ఢిల్లీ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మెగా మార్చ్‌కు 2,500 ట్రాక్టర్లలో వివిధ రాష్ట్రాలకు చెందిన 25వేల మంది రైతులు రానున్నారని నిఘా వర్గాలు అంచనా వేశాయి. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కేరళ, కర్ణాటక, తమిళనాడు రైతులు కూడా ఈ ఆందోళనలో పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments