అమరావతిలో టెన్షన్.. టెన్షన్.. బాబు కాన్వాయ్‌పై చెప్పులు!
- IndiaGlitz, [Thursday,November 28 2019]
అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా చెప్పినట్లే నవంబర్-28న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనకు పయనమయ్యారు. అయితే ఈ క్రమంలో బాబుకు టీడీపీ వర్గం ఘన స్వాగతం పలకగా.. మరోవర్గం అనగా టీడీపీని వ్యతిరేకించే వారు నిరసనలు తెలియజేస్తూ చెరోవైపు ఇరు వర్గీయులు భారీగా మోహరించారు. బాబు కాన్వాయ్ వెంకటాయపాలెంకు చేరుకోగానే.. ఓ వర్గం రైతులు రెచ్చిపోయి హడావుడి చేశారు. ఈ క్రమంలో కొందరు రైతులు అతి చేస్తూ బాబు కాన్వాయ్‌పై చెప్పులు, కర్రలు, రాళ్లు విసిరారు. అక్కడే ఉన్న పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని రైతులు.. ‘బాబూ గో బ్యాక్.. గో బ్యాక్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు.
భారీ బందోబస్తు మధ్యే..!
ఈ రాళ్ల దాడితో తామేం తక్కువ కాదన్నట్లుగా టీడీపీ వర్గీయులు, కార్యకర్తలు కూడా రెచ్చిపోయారు. రైతులపైకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ గొడవ జరుగుతుండగానే బాబు కాన్వాయ్‌ను అక్కడ్నుంచి పోలీసులు కదిలించారు. నినాదాలు చేస్తే ఊరుకునేది లేదని.. కాన్వాయ్ వెంబడి భారీ బందోబస్తు మధ్య అక్కడ్నుంచి కదిలించారు. కాగా పర్యటనలో భాగంగా.. వైసీపీ ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదికను పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయపాలెం చేరుకొని.. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని.. గృహ సముదాయాల నిర్మాణాలను పరిశీలించనున్నారు. తర్వాత రాజధానికి భూములిచ్చిన రైతులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
అందుకే అమరావతి వస్తున్నా..!
కాగా.. పర్యటను వెళ్లేందుకు ముందు.. ‘రాజధానిపట్ల 5 కోట్ల ఆంధ్రులకు ఉన్న భావోద్వేగాలు వైసీపీ వాళ్ళకు తెలుసు. అందుకే ఒక పథకం ప్రకారం దుష్ప్రచారాలు చేసి అమరావతిని క్రమక్రమంగా చంపాలన్న నీచమైన కుట్రలకు వైసీపీ తెరతీసింది. ఆ కుట్రలను బయటపెట్టేందుకే నేను అమరావతికి వెళ్తున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు పర్యటనను ఓ వర్గం రైతులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. అమరావతిలో బాబు పర్యటించాలంటే దళిత రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు సైతం బాబు పర్యటనపై విమర్శలు గుప్పించిన సంగతి విదితమే.