విశాఖ ఎల్జీపాలిమర్ వద్ద ఉద్రిక్తత.. సీఎం జగన్ రావాలని డిమాండ్
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖపట్నంలోని ఎల్జీపాలిమర్స్ ఫ్యాక్టరీ వద్ద ఇటీవల జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 12 మంది చెందగా.. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు.. 24 గంటల్లోనే ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేసింది. అయితే ఇక అంతా ప్రశాంతంగా ఉంది.. పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వచ్చిందనుకున్న టైమ్‌లో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.
తరలించాల్సిందే..
శనివారం ఉదయం పాలిమర్స్ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్‌ఆర్ వెంకటాపురం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ పరిశ్రమ వద్ద గ్రామస్థులు ధర్నా చేపట్టారు. పరిశ్రమ గేటు వద్దే మృతదేహాలతో వారు ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. అంతేకాదు.. తక్షణమే ఆ పరిశ్రమను అక్కడ్నుంచి వేరే ప్రాంతానికి తరలించాల్సిందేనంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పలువురు ఆందోళనాకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే.. ఈ పరిశ్రమను ఇక్కడ నుంచి తరలించే వరకు తమ ఆందోళనను విరమించబోమని గ్రామస్థులు చెబుతున్నారు.
పరిశ్రమ మూసేయాలి..
నేతలు, అధికారులు పరిశ్రమను చూసి వెళ్లిపోతున్నారని.. బాధిత గ్రామాల్లోకి మాత్రం ఎవరూ రావట్లేదని ఆందోళనాకారులు చెబుతున్నారు. బాధిత 5 గ్రామాల ప్రజల బాగోగులు చూడటానికి మాత్రం ఎవరూ రాలేదని స్థానికులు మండిపడుతున్నారు. తమకు ఆహారం, తాగునీరు అందించడం లేదని.. ప్రజాప్రతినిధులు వచ్చి 5గ్రామాల కష్టాలు వినాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమను మూసివేస్తామని తక్షణమే యాజమాన్యం ప్రకటించాలనే డిమాండ్ పెరిగింది. అదే విధంగా పరిశ్రమ యజామానులను వెంటనే అరెస్ట్ చేయాలంటున్నారు.
జగన్ రావాల్సిందే..!
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చి గ్రామంలోని పరిస్థితిని పరిశీలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద ఘటనపై పరిశ్రమ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలని స్థానికులు కోరుతున్నారు. బాధితుల చికిత్సకు డబ్బులు చెల్లించాలని కొన్ని ఆస్పత్రులు అడుగుతున్నాయని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం వేసిన కమిటీ.. బాధిత 5గ్రామాల్లో తిరిగి ప్రజలతో మాట్లాడాలని.. అదే విధంగా ఈ గ్రామాల్లో గాలిలో ఆక్సిజన్ స్థాయి పెంచాలని స్థానికులు సర్కార్‌ను డిమాండ్ చేస్తున్నారు. తక్షణం సహాయచర్యలు చేపట్టకుంటే ఇక్కడకు ఎవరూరారని.. గ్యాస్ లీకేజీ ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కనీసం సైరన్ కూడా మోగించలేదని.. కంపెనీలో ఉపాధి పొందుతున్న వారిలో స్థానికేతరులే ఎక్కువగా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.
మంత్రి, డీజీపీని అడ్డుకున్న వైనం..
బాధితులను పరామర్శించేందుకు మంత్రి అవంతి శ్రీనివాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. దీంతో మరింత ఉద్రిక్తత పెరిగింది. తమకు న్యాయం చేయాల్సిందేనని మంత్రి, డీజీపీని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ లోపలే డీజీపీ ఉండటంతో.. ఈ క్రమంలో ఫ్యాక్టరీ గేటు తోసుకుని లోనికి వెళ్లేందుకు కూడా గ్రామస్థులు ప్రయత్నించారు. దీంతో డీజీపీ చుట్టూ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షణ వలయంలా పోలీసులు ఏర్పడ్డారు. పరిశ్రమలోనికి ఎవర్నీ రానివ్వకుండా స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments