ఫిబ్రవరి 11న గ్రేటర్లో ఏం జరుగుతుంది? టెన్షన్ టెన్షన్..
- IndiaGlitz, [Saturday,January 23 2021]
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు ముగిసి నెలన్నర పైగా అవుతోంది. అయినప్పటికీ మేయర్ ఎన్నిక ఇప్పటికీ జరగలేదు. తాజాగా ఈ ఎన్నికపై ఓ క్లారిటీ వచ్చింది. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక ఫిబ్రవరి 11న జరగనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి శుక్రవారం నోటిపికేషన్ జారీ చేశారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్ల మొదటి సమావేశం ప్రారంభమవుతుంది. ముందుగా కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, అనంతరం మేయర్ ఎన్నిక, తదుపరి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఒకవేళ ఏ కారణంగానైనా ఎన్నిక నిలిచిపోతే.. మరుసటి రోజు సమావేశం నిర్వహించి ఎన్నుకుంటారు. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే జిల్లా కలెక్టర్లలో ఒకరు ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారు.
కాగా, మేయర్, డిప్యూటీ మేయర్లను మేజిక్ ఫిగర్‌తో సంబంధం లేకుండా చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకుంటారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరి ఎన్నిక ఇదే రీతిలో జరుగుతుంది. జీహెచ్ఎంసీలో మొత్తం కార్పొరేటర్లు 150 (టీఆర్ఎస్-56, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2) మంది ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులు 45 మంది ఉన్నారు. దీంతో, మొత్తం సభ్యుల సంఖ్య 195 అవుతుంది. సమావేశానికి కోరం అంటే కనీసం 98 మంది హాజరు కావాలి. ఈ 98 మంది సభ్యులు సమావేశానికి హాజరైతే.. వీరిలో మెజారిటీ మద్దతు కూడగట్టుకున్న వారు మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవుతారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా. ప్రస్తుతానికైతే అవకాశం టీఆర్ఎస్కే ఎక్కువగా ఉంది. కానీ సమయం ఉంది కాబట్టి బీజేపీకి కూడా అవకాశం లేకపోలేదు. కొందరు కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుంటే చాలు. మేయర్ పీఠం బీజేపీ వశమవుతుంది.
నిజానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఒకరకంగా టీఆర్ఎస్కు చావు తప్పి కన్నులొట్టబోయినట్టు అయింది. ఈ క్రమంలో ఇప్పుడు తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లను కాపాడుకోకుంటే మేయర్ పీఠాన్ని చేజార్చుకున్నట్టే అవుతుంది. మరోవైపు బీజేపీ కూడా ఇక మీదట బుద్ధికి పని చెప్పే అవకాశమూ లేకపోలేదు. మొత్తానికి నేడో, రేపో క్యాంపు రాజకీయం తెలంగాణలో ప్రారంభమవడం ఖాయంగా కనిపిస్తోంది. మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ చేజార్చుకుంటే ఆ పార్టీకి అది కోలుకోలేని దెబ్బే అవుతుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నామన్న అభిప్రాయం కలిగిస్తూనే.. పరోక్షంగా పాలకమండలి ఏర్పాటు జరగకుండా చూడాలన్న వ్యూహం అమలు చేస్తున్నారన్న ప్రచారమైతే జరుగుతోంది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో కూడిన పాలకమండలిని సుప్త చేతనావస్థలో ఉంచాలనుకుంటున్నారని చెబుతున్నారు. అసలు తెలంగాణలో మేయర్ ఎన్నిక అనేది జరుగుతుందో.. లేదో.. జరిగితే ఏ పార్టీ అభ్యర్థి మేయర్‌గా ఎన్నికవుతారనేది ఆసక్తికరంగా మారింది.