Tenali Ramakrishna BA.BL Review
వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపే హీరోల్లో సందీప్ కిషన్ ముందు వరుసలో ఉంటారు. ఈ యువ కథానాయకుడికి ఈ ఏడాది `నినువీడని నేనే`తో సక్సెస్ అందుకున్నాడు. తాజాగా `తెనాలి రామకృష్ణ బీఏబీఎల్` అనే ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నాగేశ్వరరెడ్డికి కూడా మంచి బ్రేక్ అవసరం అయిన తరుణంలో `తెనాలి రామకృష్ణ బీఏబీఎల్` చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? అని తెలుసుకోవాలంటే ముందుగా కథలోకి వెళదాం..
కథ:
కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఓ తెల్లవారు జామున జర్నలిస్ట్ హత్య జరగుతుంది. ఆ ప్రాంతంలో రాజకీయంగా ఎదగాలనుకుంటున్న సింహాద్రి నాయుడు(అయ్యప్ప పి.శర్మ).. తప్పుడు సాక్ష్యాలతో ప్రజల మంచి కోరే వ్యాపారవేత్తగా జిల్లాలోనే మంచి పేరున్న వరలక్ష్మీ దేవి(వరలక్ష్మీ శరత్ కుమార్)ని ఆ కేసులో ఇరికిస్తాడు. లాయర్ చదివినా పెద్ద కేసులు రాకపోవడంతో తెనాలి రామకృష్ణ(సందీప్ కిషన్) సివిల్ కేసుల సెటిల్‌మెంట్స్ చేస్తుంటాడు. మంచి కేసు కోసం ఎదురు చూస్తున్న రామకృష్ణ దగ్గరికి వరలక్ష్మి దేవి కేసు వస్తుంది. సీనియర్ లాయర్ చక్రవర్తి(మురళీ శర్మ)ను తన తెలివి తేటలతో రామకృష్ణ ఓడిస్తాడు. ఆమె బయటకు వచ్చిన తర్వాత కేసుకు సంబంధించిన ఓ కొత్త కోణం బయటకు వస్తుంది. రామకృష్ణకు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ షాకింగ్ నిజాలేంటి? అసలు రామకృష్ణ అసలు హంతుకులను పట్టుకున్నాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
తెనాలి రామకృష్ణ అంటే వికటకవి పేరు ఠక్కున గుర్తుకు వస్తుందనడంలోసందేహం లేదు. మంచి హాస్యాన్ని పండించే వ్యక్తి పేరుని టైటిల్‌గా పెట్టుకోవడం.. కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాలో మంచి కామెడీ ఉంటుందని సగటు ప్రేక్షకుడు ఆశిస్తాడనడంలో సందేహం లేదు. మరి సినిమాలో కామెడీ ఎంత వరకు వర్కవుట్ అయ్యిందనే విషయానికి వస్తే టైటిల్ పాత్రలో నటించిన సందీప్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఏమీ తెలియకపోయినా, అన్ని తెలిసిన లాయర్‌గా నటించిన హన్సిక నటన ఆకట్టుకుంటుంది. హీరో, హీరోయిన్ మధ్య ఫస్టాఫ్‌లో వచ్చే లవ్ ట్రాక్ బావుంది. సందీప్ కిషన్‌తో పాటు ప్రభాస్‌శ్రీను, సప్తగిరి మధ్య కామెడీ సీన్స్‌తో ఫస్టాఫ్ పరావాలేదనిపిస్తుంది. ఓ ట్విస్ట్‌తో ఇంటర్వెల్. ఇక సెకండాఫ్‌లో సందీప్ కిషన్, వరలక్ష్మి వారి వారి పాత్రల్లో పోటీ పడి నటించారు. జడ్జిగా నటించిన పోసాని కామెడీ బాగానే అనిపిస్తుంది. వెన్నెలకిషోర్ పాత్ర సరిగా వర్కవుట్ కాలేదు. సినిమాలోని కామెడీ మనస్ఫూర్తిగా నవ్వుకునే కామెడీ అయితే కాదు.. ప్రేక్షకుడు ఏదో ఊహించుకుని వెళ్లేంత ట్విస్టులు, టర్న్‌లు, పగలబడి నవ్వేంత కామెడీ సినిమా నుండి ఆశించడం తప్పే అవుతుంది. సాయికార్తీక్ సంగీతం పరావాలేదు. సాయిశ్రీరామ్ కెమెరా పనితనం బావుంది. ఆసక్తికరమైన సన్నివేశాలు, గ్రిప్పింగ్ కథనంపై దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కాస్త మనసు పెట్టి ఉంటే బావుండేది కదా! అనిపిస్తుంది.
చివరగా.. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్... జస్ట్ ఓకే
Read Tenali Ramakrishna Review in English
- Read in English